calender_icon.png 28 January, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటికీ వార్డు బడ్జెట్ లెక్కలు

28-01-2026 01:10:08 AM

పురపోరుకు మ్యానిఫెస్టో విడుదల చేసిన టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ప్రతి రూపాయి ఖర్చు  ప్రజల ముందుకు

నెలలో ఒకరోజు ప్రజా ఆడిట్ డే

ప్రతి 6 నెలలకు రైట్ టూ రీకాల్ 

2023 నుంచి 2026 జనవరి వరకు వాహన చలాన్లు మాఫీ

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మ్యానిఫెస్టోను పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 కీలక అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను రూపొందించినట్లు వెల్లడించారు.

ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలు, పారదర్శక పాలన లక్ష్యంగా మ్యానిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో అవినీతికి తావులేని వ్యవస్థను నిర్మించి, ప్రజలను నేరుగా పరిపాలనలో భాగస్వాములను చేసే విధంగా తమ మ్యానిఫెస్టో రూపొందించామన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు సవాల్ విసిరిన తీన్మార్ మల్లన్న..

ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతిపాదించిన అంశాలను ఆయా పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై రాజీపడని పోరాటమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సరికొత్త పాలనకు కత్తెర గుర్తుకు ఓటేయాలని ఆయన కోరారు. 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ మ్యానిఫెస్టో 

1) ఈ మున్సిపాలిటీ ప్రజలది. టీఆర్పీ హామీలు ఇవ్వదు. ప్రజలే మాకు ఆదేశాలు ఇవ్వాలి.

2) రైట్ టూ రీకాల్ ( ఓటు వాపసు తీసుకునే హక్కు). ఎన్నికల తర్వాత ప్రతి 6 నెలలకు వార్డులొ ప్రజా ఓటింగ్. ఇందులో ఈ కౌన్సిలర్ పనితీరు సరిపోతుందా? ఈ వార్డుకు ఏ పని అత్యవసరం? ఎవరు అవినీతికి పాల్పడ్డారు? అనే ప్రశ్నలుంటాయి. 50% కంటే తక్కువ నమ్మకం వస్తే కౌన్సిలర్ అధికారాలు సస్పెండ్ చేస్తారు.

3) మన డబ్బు- మన నిర్ణయం.. మన వార్డులో వసూలైన పన్నులు 40 శాతం మన వార్డులోనే ఖర్చు చేసే పథకం. ప్రతి పనికి ప్రజల ఆమోదం తప్పనిసరి చేస్తాం. ఇంటింటికి వార్డు బడ్జెట్ లెక్కలు అందిస్తాం. ప్రతి రూపాయికి లెక్కలు చూపించే సిస్టం తెస్తాం. 

4) టాక్స్, సేవల ఒప్పందం.. ప్రజలు కట్టే పన్నులకు సరిపడా సేవలు అందాలి. కట్టేది ఎంత? మీకు వచ్చేది ఎంత? ప్రతినెల లెక్కలు మీ చేతిలోనే. 

5) ప్రజా ఆడిట్ డే (ప్రజలకు లెక్కలు చెప్పే రోజు).. ప్రతి నెలలో ఒకరోజును ప్రజా ఆడిట్ డేగా మార్చడం. వార్డులో జరిగిన పని, ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టడం. కమిషనర్, కాంట్రాక్టర్, ఇంజినీర్ అంతా మీ ముందుకే..

6) బస్తీలకు భరోసా.. a.ల్యాండ్ టైటిల్ లైట్, b. బ్యాంక్ లోన్‌కు చూపించొచ్చు, c. వ్యాపారానికి ఉపయోగించొచ్చు, d. మీ ఇంటిపై మీకే హక్కు.. మీరున్న స్థలం మీదే.

7) యువత చేతికి వార్డు రాజకీయాలు.. ప్రతి వార్డులో 10 మంది యువతను మున్సిపల్ అప్రెంటీస్‌లుగా మార్చి వారికి అధికారాలిస్తాం. ఏ శాఖలో ఫైళ్లు ఎలా నడుస్తాయి? బడ్జెట్ ఎలా తయారవుతుంది? వివరాలు అందిస్తాం.

8) భద్రతతో కూడిన భరోసా.. వార్డు పంచాయితీలు వార్డులోనే పరిష్కారం. ప్రతి మహిళ భద్రతకు గ్యారంటీ కార్డులు. పోలీసు స్టేషన్ చివరి అప్షన్ మాత్రమే. 

9) ట్రాఫిక్ చలాన్ల మాఫీ.. 2023 నుంచి 2026 జనవరి వరకు వాహన చలాన్లు మాఫీ.. రోడ్లు బాగుంటేనే వాహనాలపై ఛలాన్లు

10) పట్టణం మనది.. పాలన మనది.. మీరు ఓటువేసేది నాయకులకు కాదు మీ ఆత్మగౌరవ జీవనం కోసం.