07-06-2025 12:49:56 AM
-డొమెస్టిక్తో కమర్షియల్ దందా
-హోటల్లు, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వినియోగం
-కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలలో ఇదే తీరు
-తనిఖీలను మరచిన సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్
కామారెడ్డి, జూన్ 6,(విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా లో డొమెస్టిక్ సిలిండర్ల దందా కమర్షియల్ గా సాగుతోంది. గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు యదేచ్చగా పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యాపారం ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల లో దోమకొండ, బీబీపేట్, భిక్కనూరు, రామారెడ్డి ,మాచారెడ్డి, రాజంపేట, పిట్లం, మద్నూర్, నాగిరెడ్డిపేట్, మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తుంది.
నిబంధనలకు విరుద్ధంగా హోటల్లో, రెస్టారెంట్ ,ఫాస్ట్ ఫుడ్, టీ పాయింట్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లు దొంగ చాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి గండిపడుతున్నడంతో పాటు కొంతమంది ఏజెన్సీదారులకు తెరచోటన ఇదొక వ్యాపారం గా మారి పోయింది. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
హోటల్లు ,టీ పాయింట్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సెంటర్లు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి అయితే చాలా మటుకు ఆ నిబంధనలో పాటించడం లేదు ఎందుకంటే 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం దాదాపు రూ.2100 వరకు ఉంది. అదే గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి దాని విలువ దాదాపు రూ.978 వరకు ఉంది.
ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్ కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది దీంతో హోటల్లో, టీ పాయింట్, హోటల్లు ,రెస్టారెంట్ కేంద్రాల నిర్వహకులు ఇది తప్పని తెలిసిన డొమెస్టిక్ గ్యాస్ ను వినియోగించడానికి వక్రమార్గాన్ని ఆచరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలను మచ్చిగా చేసుకొని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఒక సిలిండర్ పై రూ. 200 వరకు లాభం రావడంతో మూడు పూలు ఆరు కాయలుగా మారింది.
ఇటు సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏజెన్సీ లతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీరి డొమెస్టిక్ దందా జోరుగా సాగుతుందన్నట్లు తెలుస్తోంది. కామరెడ్డి నియోజవర్గం అంతట హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపారాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు హోటల్లో సామర్థ్యం ఆధారంగా వారం 1 నుంచి 2 మరియు కొన్నింటిలో నెలకు 5 వరకు వినియోగం అవుతున్నాయి.
ఒక కమర్షియల్ సిలిండర్ పై వెళ్లదీయడం సాధ్యం కాని పని ఈ సందర్భంగా డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నారు కార్లు ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎక్కిస్తున్నారు ఇలా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్న అధికారులు మాత్రం ’మామూలు’గానే తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ పనులకు ఉపయోగిస్తున్నారని ఆరోపణలపై జిల్లా సివిల్ సప్లై అధికారి మల్లికార్జున బాబును విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్ లను కమర్షియల్ గా వాడితే సీజ్ చేస్తామన్నారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకుంటామన్నారు.
మల్లికార్జున బాబు, జిల్లా సివిల్ సప్లై అధికారి, కామారెడ్డి