25-07-2025 02:29:58 AM
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 24: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తన మేనకోడలి కూతురు పుట్టిన రోజు వేడుకల్లో భార్యను హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. సూర్యాపేటకు చెందిన సమ్మక్క(42), శ్రీనివాస్‌లు దంపతులు. శ్రీనివాస్ పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. సమ్మక్క అక్క అయినా కళావతితో శ్రీనివాస్‌కు గతంలో పెండ్లి అయింది.
వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కళావతి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇరుకుటుంబ సభ్యుల పెద్దలు మాట్లాడుకుని శ్రీనివాస్‌కు సమ్మక్కను ఇచ్చి రెండో వివాహం చేశారు. వీరికి కూడా ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్లు వీరి సంసారం సాఫీగా సాగింది. గత కొన్ని రోజులుగా సమ్మక్కపై శ్రీనివాస్‌కు అనుమానం పెరిగింది. ఇతర వ్యక్తితో సమ్మక్క చనువుగా ఉంటున్నట్లు అనుమానం పెంచుకున్నాడు.
ఇదే విషయంపై గత 15 రోజుల క్రితం సూర్యాపేటలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత సమ్మక్క హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో బీసీ కాలనీలో ఉంటుంది. శ్రీనివాస్ మేనకోడలు రాజేశ్వరి కూడా బీసీ కాలనీలో నివాసముంటుంది. రాజేశ్వరి కుమార్తె (14) పుట్టిన రోజు సందర్భంగా గురువారం శ్రీనివాస్, సమ్మక్క వచ్చారు.
రాజేశ్వరి కుమార్తె కేక్ కట్ చేసే క్రమంలో సమ్మక్క తన ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీస్తున్న క్రమంలో శ్రీనివాస్ ఒక్కసారిగా కత్తితో సమ్మక్క గొంతు కోసి హత్య చేసి, పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ వీ అశోక్‌రెడ్డి తెలిపారు.