calender_icon.png 27 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పథకంలో భారీ స్కాం..?

27-07-2025 12:25:20 PM

40 లక్షలు కాజేసారని కూలీల, గ్రామస్థుల ఆరోపణ

ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యుల పేర్లమీద ఉపాధి డబ్బులు విడుదల

అధికారుల తీరుపై అనుమానాలు..?

గుంటూరు పల్లి ఉపాధి హామీలో జరిగిన పనులపై విచారణ చేపట్టాలి

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా స్కాం జరిగిందని, ఈ ఘటనలో మాజీ ప్రజా ప్రతినిధి పాత్రపై విచారణ చేయాలని గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. సుమారు 40 లక్షల రూపాయలు పనులు చేయకుండానే కూలీలకు తెలియకుండానే, ఆ ప్రజా ప్రతినిధి తన సొంత ఖాతాకు మళ్లించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో 2020 - 2021 నుండి ఈ ఏడాది వరకు జరిగిన ఉపాధి హామీ పథకంలో కూలీల డబ్బులను వారికి తెలవకుండా సమాచారం ఇవ్వకుండా అధికారులతో కుమ్మక్కై తన సొంత అకౌంట్ కు మళ్లించుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

అంతేకాకుండా గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో పావలా  వంతు కూడా పనులు చేయలేదని, ప్రభుత్వం నుండి వచ్చిన రూపాయలను మాత్రం అప్పటి ప్రజా ప్రతినిధి  కాజేచేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్, బృహత్ పల్లె పకృతి వనం, పల్లె ప్రకృతి వనం, ఎస్ఆర్ఎస్ పి కాలువ మరమ్మత్తులు, కల్లాలు, నర్సరీలు, చెరువుల పనులు, మొక్కలు నాటుట, గవర్నమెంట్ మంచినీటి బావిలో పూడిక తీత, గ్రామానికి మంచినీరు తన సొంత బావి నుండి అందించానని, ఇలా అనేక రకాలైన బిల్లులను సృష్టించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు 40 లక్షల రూపాయలతో వివిధ పనులు చేసినట్లు తెలిపారు. ఇందులో 70 శాతం రూపాయలను  ఉపాధి హామీ కూలీలకు అందకుండా నకిలీ జాబ్ కార్డులను సృష్టించి రూ.లక్షలను స్వాహా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అప్పటి పీడీ అండదండలతో గుంటూరు పల్లి గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి  కుటుంబ సభ్యులపై సుమారు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వారి అకౌంట్లో ఉపాధి హామీ కూలి పని చేసినట్లు పడ్డాయని వారు తెలిపారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో ఉన్న వారి పేర్ల మీద కూడా జాబు కార్డులను సృష్టించి వారి అకౌంట్లో డబ్బులు పడినట్లు పలు ఆధారాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. అప్పటి సర్పంచి ఉపాధి హామీ కూలి పని చేసినట్లు సర్పంచి తన భర్త పేరు మీద కూడా డబ్బులు పడడం ఏమిటని కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్క రోజు ఉపాధి హామీ కూలికి రాకుండా మాజీ గ్రామ సర్పంచి, సర్పంచి భర్త, మామ అత్తల పేర్ల మీద కూడా డబ్బులు అకౌంట్లో వేయించి డ్రా చేసుకున్నట్లు నివేదికలు  సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై 2020,2021,2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఉపాధి కూలీలకు తెలుపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కూలీ పనులకు రాని వారి పేర్ల మీద అనేక రూపాయలు విడుదల చేసి స్వాహా చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై గ్రామంలోనే గ్రామ సభ ఏర్పాటు చేసి ఉపాధి హామీ కూలి పనులు చేసిన వివరాలను వచ్చిన రూపాయలు వెల్లడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో తెలుపాలని కోరారు. గుంటూరు పల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ కూలి పనుల పై వెంటనే భూపాలపల్లి జిల్లా కలెక్టర్, పిడి సమగ్ర విచారణ చేపట్టాలని  ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై  భూపాలపల్లి జిల్లా ఉపాధి హామీ పీడీ, జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు సదాశివరావు, మన్యం శ్రీనివాసరావు, సతీష్ కుమార్, ఏం. శ్రీనివాసరావు, కే.రామకృష్ణ , శ్రీకాంత్, కే.శ్రీనివాస్ తదితరులు తెలిపారు. దీనిపై చిట్యాల ఏపీఓ అలిమ్ ను విజయ క్రాంతి వివరణ కోరగా దీనిపై గతంలో మూడుసార్లు సామాజి తనిఖీ, విచారణ జరిగిందని తెలిపారు.