calender_icon.png 27 July, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ విఫలం

25-07-2025 02:30:51 AM

అడ్వకేట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ 

చేవెళ్ల, జులై 24: తెలంగాణ బార్ కౌన్సిల్ కనీస విధుల్లో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర అడ్వకేట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి. రఘునాథ్ విమర్శించారు. యువ న్యాయవాదులకు అవసరమైన శిక్షణ, నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో, న్యాయవాదుల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చేవెళ్ల కోర్టులో బార్ అసోసియేషన్ ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.

అనంతరం ఆ యన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు జరుగుతున్నాయని, కింది కోర్టుల్లో ఆర్టికల్ 14, 19 ఉల్లంఘన జరుగుతుందని ఆరోపించారు. జడ్జిల నియామకంలో పారదర్శకత లేకపోవడంతో న్యాయ వ్యవస్థలో రెండు గ్లాసుల విధానం రాజ్యం ఏలుతోందని వి మర్శించారు. రాష్ట్రంలో ప్రతీ ఏడాది 10 వేలమంది న్యాయ విద్యార్థులు సిద్ధమవుతున్నా, వారికి సరైన మార్గనిర్దేశం, శిక్షణ అందకపోవడం ఆందోళనకరమన్నారు.

యువ న్యాయవాదులు రీసె ర్చ్, డ్రాఫ్టింగ్, ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించిన ఆయన, భవిష్యత్తులో శిక్షణ తరగతుల ద్వారా ప్రతిభను వెలికితీసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్లకు కనీస వసతులైన కంప్యూటర్లు, లైబ్రరీలు లేవని, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల న్యాయవాదులకు ఇది పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి బార్ కౌన్సిల్ చట్టపరమైన సహకారం అందించాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడూ అమాయకుల పక్షాన నిలిచి, రాజ్యాంగాన్ని రక్షిస్తూ తుది శ్వాస వరకు న్యాయం కోసం పోరాటం చేస్తానని స్పష్టంచేశారు.