29-09-2025 01:20:59 PM
సినిమాల పైరసీని ప్రోత్సహిస్తున్నది బెట్టింగ్, గేమింగ్ నిర్వహకులే
బయటపడ్డ సినిమా పైరసీ ముఠా బాగోతం
సినిమా రిలీజ్ కాకముందే సర్వర్లను హ్యాక్
రెండు రకాలుగా సినిమా పైరసీ
టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ తోనే సినిమాల పైరసీ
హైదరాబాద్: పైరసీ మూవీలు అప్ లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand ) మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముఠా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల మేర నష్టం వాటిల్లిన ట్లు పేర్కొన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోందని వెల్లడించారు. కొత్తగా ఎంవో అనే విధానంలోనే పైరసీ జరుగుతోందన్నారు. థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారని చెప్పారు. సింగిల్, హిట్ సినమాల పైరసీ జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. పైరసీ కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని ఆయన వెల్లడించారు.
సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మరొకరికి పంపించాడని ఆనంద్ సూచించారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ తో సినిమాను రికార్డింగ్ చేస్తారని చెప్పారు. కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసీ చేశారని వెల్లడించారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాను థియేటర్ లో రికార్డింగ్ చేశారని తెలిపారు. సెల్ ఫోన్లను జేబులోగానీ, పాప్ కార్న్ డబ్బాలో గానీ పెడతారని వివరించారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్కీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందని సూచించారు. మొబైల్ స్కీన్ లైట్ ఆఫ్ లో ఉండటంతో ఎవరికీ అనుమానం రాదని చెప్పారు. ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారన్న సీపీ ఆనంద్ సినిమా పైరసీలకు నెదర్లాండ్స్ కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారని పేర్కొన్నారు. పైరసీ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని తెలిపారు. పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నామని నిందితులు పేర్కొన్నారు. మేం కేసును ఛేదించిన విధానం తెలిసి షాక్ అయినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి బెట్టింగ్ యాప్ ల నుంచి నెలకు దాదాపు రూ. 9 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని సీపీ స్పష్టం చేశారు.
క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా తమకు కొంత క్లూ దొరికిందని తెలిపారు. నిందితులు డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం సంపాదించారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వెబ్ సైట్లను కూడా హ్యాక్ చేశారని వివరించారు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేశారని చెప్పారు. ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగుల వివరాలు, జీతాల వివరాలు పొందగలిగారని పేర్కొన్నారు. పాట్నాలో కూర్చొని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశారు. నిందితుల వల్ల పలు కంపెనీలు వాళ్ల ఉద్యోగులను అనుమానించే పరిస్థితి వచ్చిందన్నారు. సినిమాల పైరసీని ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది.. బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకులే అని తెలిపారు. పైరసీ సెట్లలోని లింక్ లను క్లిక్ చేస్తే... యూజర్ వివరాలన్నీ పైరసీ ముఠాకు వెళ్తాయని సీపీ హెచ్చరించారు. వివరాలు సేకరించి వేరే విధంగానూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరో ప్రధాన నిందితుడు పాట్నాకు చెందిన అశ్వీనీ కుమార్ హ్యాకింగ్ స్పెషలిస్ట్ అన్న సీపీ డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అశ్వీనీకుమార్ కు ఉందని తెలిపారు. డిజిటల్ మీడియా హౌస్ లు జాగ్రత్తగా ఉండాలని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. సినిమా ఫుటేజీని భద్రపరచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సర్వర్ కు ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తే.. మరో మార్గంలో వస్తారని, పైరసీ విషయంలో థియేటర్లు, మీడియా హౌస్ లలో జరిగిన చోరీ కాదన్నారు. ఎక్కువ సినిమాల పైరసీ కిరణ్, అశ్వనీ కుమార్ ముఠా వల్లే జరిగిందని ఆనంద్ పేర్కొన్నారు.