22-09-2025 12:53:06 PM
వరదల వల్ల నిరుపేదలే నష్టపోతున్నారు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని హైడ్రా కమిషనర్ ఏ.వీ రంగానాథ్(Hydra Commissioner Ranganath) సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వరదల వల్ల ఎక్కువగా నిరుపేదలే నష్టపోతున్నారని సూచించారు. వరదల నియంత్రణ కోసం చెరువులను పునరుద్ధరించాలని, నాలాలను బాగు చేసుకోవాలని తెలిపారు. నగరంలో నాలాలు కూడా చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. వర్షం నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి, నీరు నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. కాంక్రీటైజేషన్(Concretization) వల్ల వర్షపునీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదని తెలిపారు. అధిక పొల్యూషన్ వల్ల కూడా నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని పేర్కొన్నారు. పార్కులు, చెరువులు గురించి జన్- జడ్ ఆలోచించాలని సూచించారు.
ప్రస్తుతం 51 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.. త్వరలోనే 72కు పెంచుతామని హైడ్రా కమిషనర్(Hydra Commissioner) పేర్కొన్నారు. నగరంలో 150 మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయని తెలిపారు. అక్రమణలకు గురైన నాలాలు గుర్తించి ఆక్రమణలు తొలగిస్తున్నామని వెల్లడించారు. నాలాల్లో పూడిక తొలగింపును ముమ్మరం చేశామన్నారు. నాలాల్లో పూడికతీత ఫలితం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కనిపిస్తోందన్నారు. వర్షం లేని రోజుల్లో హైడ్రా(Hyderabad Disaster Management and Asset Protection Agency) సిబ్బంది పూడికతీత పనులను చేపడుతోంది, వర్షం పడుతున్న రోజుల్లో వరద సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 920 ఎకరాలను సంరక్షించామని రంగనాథ్(Ranganath) వెల్లడించారు. దాదాపు 50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులు రక్షించామని తెలిపారు. నగరంలో ఆరు చెరువులను పూర్తిగా పునరుజ్జీవనం చేశామని చెప్పారు. నిన్న గాజులరామారంలో(Gajularamaram) ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలనే తొలగించామన్నారు. గాజుల రామారంలో నకిలీ పట్టాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టారని ఆయన వెల్లడించారు.