calender_icon.png 22 September, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి సంబంధం కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

22-09-2025 12:52:52 PM

కామారెడ్డి (విజయక్రాంతి): పెళ్లి సంబంధం కుదరడం లేదని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాద ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. నరసన్నపల్లి గ్రామానికి చెందిన ధ్యాప మహేష్(28) దుబాయ్‌కి వెళ్లి వచ్చాడు. పెళ్లి చేస్తే భారం దిగుతుందని, ఇంటికి ఓ కోడలు కూడా వస్తుందని తండ్రి సాయిలు భావించాడు. కొడుకు కోసం చాలా వరకు పెళ్లి సంబంధాలు చూసాడు. అయినా ఒక్క సంబంధం కూడా కుదరలేదు. దాంతో మహేష్ తనకెందుకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మధనపడేవాడు. గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లిన మహేష్ చాలా సేపైనా ఇంటికి రాకపోవడంతో తండ్రి సాయిలు ఆందోళనకు గురయ్యాడు.

గ్రామంలో వెతుక్కుంటూ వెళ్తుండగా రైలు పట్టాలపై విగతజీవిగా కనపడ్డాడు. దీంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. విషయం కాస్త క్షణాల్లో గ్రామంలో వ్యాపించగా గ్రామస్తులంతా రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుని ఆత్మహత్య రైల్వే అధికారులకు చేరవేయగా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని సోమవారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తాను ఎవరికోసం బ్రతకాలి అంటూ తండ్రి పడే వేదన గ్రామస్తులను కలిచివేసింది. మహేష్ మృతితో ఆ ఇంటికి వారసులు లేకుండా పోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.