23-01-2026 12:49:17 AM
30 ఏళ్లుగా రోడ్డును కబ్జా చేసిన ప్రహరీ నేలమట్టం
శామీర్ పేట్, జనవరి 22 (విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. గురువారం ఉదయం శామీర్ పేట్ కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో గత 30 సంవత్సరాల నుండి 20 అడుగుల వెడల్పు రోడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించడంతో స్థానిక ప్రజలు 30 ఏళ్లు గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న హైడ్రాధికారులు రంగంలోకి దిగారు.
హైడ్రా సీఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం చర్యలు చేపట్టారు. అక్రమంగా రోడ్డును కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడను జెసిబి సహాయంతో నేలమట్టం చేశారు. 30 ఏండ్ల సమస్య తీరడంతో ఫ్రెండ్స్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రభుత్వ భూములు, రోడ్లు కబ్జా చేస్తే కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా ధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అక్రమ నిర్మాణాలపై సమాచారం అందించాలని కోరారు.