23-01-2026 12:49:52 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం, జనవరి 22 (విజయ క్రాంతి): కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. గురువారం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు దేవాలయ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ శానిటేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని బ్రహ్మాండంగా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.
క్యూ లైన్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటూ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి నూతనంగా ఫుట్ పాత్ ను నిర్మిస్తున్నామని, అన్ని పనులు శుక్రవారం ఉదయం వరకు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఆలయ ఈవో సుధాకర్, చకిలం గంగాధర్, నాయకులు దన్నాసింగ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, చింతల కిషన్, జొన్నల రమేష్, గుడిపాటి రమణా రెడ్డి, దాసరి నరసింహారెడ్డి, రాజా గౌడ్, లక్కిరెడ్డి కిరణ్, తదితరులు ఉన్నారు.