07-05-2025 03:34:37 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ కట్టడాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాడిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో బండ్లగూడ మండలం పరిధిలోని కందికల్ గ్రామంలో బుధవారం అక్రమ ఆక్రమణలను తొలగించడం ద్వారా 2,500 చదరపు గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. సర్వే నంబర్లు 303, 306 కిందకు వచ్చే ఈ భూమిని మొదట అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం కింద వర్గీకరించారు. దీనిని సయ్యద్ బషీరుద్దీన్, సయ్యద్ అమీనుల్లా హుస్సేన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించారు.
వారు ఆస్తిని క్రమబద్ధీకరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ అనధికార ఆర్సీసీ గదులు, షెడ్లు, దుకాణాలను నిర్మించారు. ప్రజావాణి ద్వారా స్థానిక నివాసితులు సమర్పించిన ఫిర్యాదుల మేరకు, హైడ్రా(HYDRAA) అధికారులు స్థలాన్ని తనిఖీ చేసి అధికారిక రికార్డుల ఆధారంగా ఆక్రమణను నిర్ధారించింది. తదనంతరం, వారు నాలుగు ఆర్సీసీ(RCC) నిర్మాణాలను, అనేక టిన్ రూఫ్డ్ షెడ్లను, నాలుగు దుకాణాలను కూల్చివేసారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించడానికి సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.