calender_icon.png 9 May, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్యం వెంటే అందరం!

08-05-2025 01:42:37 AM

  1. అత్యవసర సర్వీసు అందించే ఉద్యోగులకు సెలవులు రద్దు 
  2. మెడిసిన్, రక్తం నిల్వలను
  3. అందుబాటులో ఉంచాలి 
  4. మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలి
  5. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 
  6. నేడు భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

హైదరాబాద్, మే ౭ (విజయక్రాంతి): ‘దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి.. ఇలాంటి సమయం లో రాజకీయాలకు, పార్టీలకు తావులేదు. అత్యవసర సర్వీసులు అందించే విభాగా ల ఉద్యోగుల సెలువులు రద్దు చేస్తు న్నాం. మంత్రులు, అధికారులు, ఉద్యోగు లందరూ అందుబాటులో ఉండాలి. విదే శీ పర్యటనలను రద్దు చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కమాండ్ కంట్రో ల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో అత్య వసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డీజీపీ జితేందర్, హోం కార్యదర్శి రవిగుప్తాతో పాటు ఆర్మీ, పోలీ సు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యా రు.

దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహా త్మక ప్రాంతంగా ఉండటం, డిఫెన్స్ విభా గాలకు స్థావరంగా ఉన్నందున ఎప్పటి కప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిం చారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ నెంబర్ ఇవ్వాలని సూచించారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు. కమాండ్ కం ట్రోల్  సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పా టు చేసుకోవాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

బ్లడ్‌బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేయాలని, అత్యవసర మెడిసిన్ సిద్ధం చేయడంతో పాటు రెడ్‌క్రాస్ సొసైటీతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బెడ్స్‌ను అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని, ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలని సీఎం అధికారులకు వివరించారు. 

సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలి.. 

సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన  పెరిగే అవకాశం ఉందన్నారు. ఫేక్‌న్యూస్ అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేయాలన్నారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని, అందుకు నగరంలోని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని, పాత నేరస్తులపై పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

దేశంలోకి చొరబడి చంపుతుంటే ఊరుకుంటామా..?  

ఆపరేషన్ సిందూర్‌ను ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నారని, తనకు కూడా ఒక భారతీయుడిగా ఎంతో గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ఆయన అన్నారు. కమాండ్ కంట్రోల్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడానికి వెళ్తుండగా, అక్కడున్న మీడియాను చూసి సీఎం రేవంత్‌రెడ్డి తన కాన్వాయ్‌ని ఆపి రోడ్డుపైనే మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండాల్సిన సమయమని, రాజకీయాల కంటే దేశం ముందు అని అన్నారు. 

నేడు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ..

భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని, భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు.  

అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి..

ఉన్నతాధికారులకు సీఎం, డిప్యూటీ సీఎం సూచనలు 

 రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్ చేపట్టిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు సీఎం, డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పూర్తిగా సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని  సీఎం, డిప్యూటీ సీఎం సూచించారు.

హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని, రక్షణ రంగానికి చెందిన సంస్థలతో పాటు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని సీఎం సూచించారు.