calender_icon.png 9 May, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ వారికి తగిన జవాబిచ్చారు!

08-05-2025 01:00:21 AM

  1. ‘ఆపరేషన్ సిందూర్’పై పహల్గాం బాధిత కుటుంబాల హర్షం
  2. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగం

న్యూఢిల్లీ, మే 7: ‘ఉగ్రవాదులు పహల్గాం బాధితులను వెళ్లి మోదీకి చెప్పమన్నారు.. ఇప్పుడు మోదీజీ వారికి తగిన సమాధానం చెప్పారు. ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన జవాబు ఇస్తుందని నేను నా కుమార్తెకు చెప్పాను. పాక్‌పై దాడులను స్వాగతిస్తున్నాం..’ అని అమరవీరుడు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ తండ్రి సునీల్ స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు.

భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’తో తమకు న్యాయం జరిగిం దని బాధిత కుటుంబాలు భావోద్వేగం చెందాయి. ఈ దాడిని వారందరూ స్వాగతించారు. సైనికచర్య గురించి విన్న తర్వాత బాధితుడు సంతోష్ జగ్దాలే కుమార్తె అశ్వని జగ్దాలే మాట్లాడుతూ..‘మేం ఆనందంతో ఏడ్చాము. మోదీ ప్రతీకారం తీర్చుకున్నారు. ఆపరేషన్ పేరు ఎలా పెట్టారో ఏమో కాని.. మా కన్నీళ్లు ఆగలేదు..’ అని భావోద్వేగాన్ని పంచుకున్నారు.

మరో బాధితుడు శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ.. పాక్‌పై సైనిక దాడి తమ కుటుంబానికి ప్రభుత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని అన్నారు. ‘నేను నిరంతరం వార్తలు చూస్తున్నాను. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను. దేశ ప్రజల బాధను విన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

ఉగ్రవాదులను అంతం చేయాలి: నెల్లూరు మధుసూదన్ కుటుంబసభ్యులు

‘ఎన్ని యుద్ధాలు చేసినా.. నా కొడుకును తీసుకురాలేరు.. నా కడుపుకోత ఏ తల్లి పడకుండా ఉగ్రవాదులను అంతం చేయాలి. నా కొడుకు అమాయకుడు. మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరూ ప్రాణాలు కోల్పో కుండా భారత్ చర్యలు తీసుకోవాలి’ అని పహల్గాం మృతుడు మధుసూదన్ తల్లి పద్మావతి వాపోయింది.

అలాగే మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దా డులు చేయడం మా కుటుంబానికి ఊరట కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నని కోల్పోవడం మా కుటుంబానికి తీరనిలోటు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగాల్ బాధితుల హర్షం..

పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ‘ఆపరేషన్ సిందూర్’పై బెంగాల్‌కు చెందిన పర్యాటకుల కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పహల్గాం ఊచకోతలో బెంగాల్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఓ మృతుడి భార్య సోహిని మీడియాతో మాట్లాడుతూ..తన భర్తను హిందువుగా గుర్తించిన తర్వాత చంపిన దారుణ సంఘటనను తాను ఇంకా తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు. మరో పర్యాటకుడు సమీర్ గుహ భార్య షోబోరి గుహా మాట్లాడుతూ..‘పహల్గాంలో తన భర్తను ఉగ్రవాదు లు ఎలా చంపారో నేను మర్చిపోలేను. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినందుకు ప్రధాని ధన్యవాదాలు’ అని ఆమె చెప్పారు. 

ఈరోజు కోసం ఎదురుచూశాం..: ఆరతి రామచంద్రన్

‘మేము ఈరోజు కోసం ఎదురుచూస్తు న్నాం.. ఇప్పుడు మాకు ఉపశమనం కలిగింది. న్యాయం జరిగిందనే భావన ఉంది’ అని ప హల్గాం మృతుడు, కేరళకు చెందిన ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆరతి తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్ అనే పేరు ఈ ఆపరేషన్‌కు సముచితమైంది. భారత దళాలకు, వారి వెనక ఉన్న వారందరికీ మేము సెల్యూట్ చేస్తున్నాం’ అంటూ ఆమె మీడియాతో మాట్లాడారు.

తగిన సమాధానం ఇచ్చారు..: సంగీతా గణబోటే

పహల్గాం దాడిలో మరణించిన కౌస్తుభ్ గణబోటే భార్య సంగీతా గణబోటే జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘సైన్యం తీసుకున్న చర్య బాగుంది. దీనికి ఆపరేషన్ సిం దూర్ అని పేరుపెట్టడం ద్వారా వారు మహిళలను గౌరవించారు. నేను ఇప్పటికీ ఏడు స్తూనే ఉన్నాను. ప్రధాని మోదీ ఇలాం టి చర్య తీసుకుంటారని మేము ఎదురుచూస్తున్నాం. వారికి ఆయన తగిన సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులను నిర్మూలించాలి.’ అని ఆమె చెప్పారు

సైన్యం చర్యపై గర్వపడుతున్నా: హిమాన్షి నర్వాల్

పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాత అమరవీరుడు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో 27 కుటుంబాలు అనుభవించిన బాధను ఇప్పుడు పాకిస్థాన్ కూడా అనుభవిస్తోందన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నందుకు సంతోషంగా ఉన్నామన్నారు. అయితే వినయ్ సహ మరో 26మంది ఇప్పుడు మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు.