08-05-2025 12:50:29 AM
న్యూఢిల్లీ, మే 7: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దాయాది దేశాన్ని ఏమార్చి అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళిక అమలుచేసింది. ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా పనిచేశాయనడంలో సందేహం లేదు.
గతంలో బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని మోదీ అమలుచేశారు. దాడులకు ముందు అంతా ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపించినా.. దాడులతో దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టించారు. గతంలో బాలాకోట్ దాడి, ప్రస్తుత సిందూర్ దాడికి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. వీటిని పసిగట్టడంలో పాక్ విఫలమైంది.
బాలాకోట్ దాడులకు ముందు..
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలాగానే ఎం తో ప్రశాంతంగా పనుల్లో నిమగ్నమయ్యా రు. అదేరోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మోదీ ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో.. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంపై ప్రసంగించారు. ఆ సమావేశంలో ఆయన ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అయితే ఆ రాత్రే భారత బలగాలు బాలాకోట్ దాడులు చేసి తమ పనిని విజయవంతంగా ముగించాయి.
ఇప్పుడు ఇలా..
బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ఎంత ప్రశాంతంగా కనిపించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మంగళవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమన్నారు. దాదాపు 30నిమిషాలు ప్రసం గించినా ఆయన ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. అలాగే బుధవారం దేశం లో పలుచోట్ల మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు.
దేశ ప్రజలను సైనిక చర్య కు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని అంతా భావించారు. అయితే ఇదంతా దా యాదిని ఏమార్చడానికే అని ఎవరూ ఊ హించలేకపోయారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు విజయవంతమయ్యాయి.