02-07-2025 12:58:48 AM
- మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌ల సేవలు షురూ
- యంత్ర పరికరాలతో రంగంలోకి బృందాలు
- 150 బృందాల్లో 4,100 మంది సభ్యులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. 150 మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లను రంగంలోకి దించింది. 150 బృందాల్లో మొత్తం 4,100 మంది ఉంటారు. ఒక్కో షిఫ్టులో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. 368 స్టాటిక్ టీమ్‌లు ఉండగా 734 మంది సభ్యులు ఉన్నారు. వర్షపు నీరు నిలిచే చోట రెండు షిఫ్టుల్లో వీరు పని చేస్తారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు 51 ఉండగా ఒక్కో టీమ్‌లో 18 మంది ఉంటారు.
మొత్తం 918 మంది సేవలందిస్తారు. వీరు ఒక్కో షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున పని చేస్తారు. ఎమర్జన్సీ బైకు బృందాలు 21 ఉన్నాయి. ఒక్కో బైకుపైన ఇద్దరు చొప్పున మొత్తం 42 మంది పని చేస్తారు. 30 సర్కిళ్లలో పనులను పర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన మార్షల్స్ 30 మంది ఉంటారు. ట్రాఫిక్ పోలీసులతో కలసి పని చేసేందుకు రెండు షిప్టుల్లో కలిపి 200ల మందితో 20 బృందాలు, చెట్టుకొమ్మలు, చెత్తను ఎత్తుకెళ్లేందుకు వీలుగా.. ఒక్కో షిప్టులో ముగ్గురు చొప్పున ఉండేలా 240 మంది అందుబాటులో ఉంటారు.
పనిముట్లు పంపిణీ
వరద నీరు నిలిచిన వెంటనే తోడేందుకు నీటి పంపులు, చెట్లు పడిపోతే తొలగించడానికి కటింగ్ మెషిన్లు, చెత్తను తొలగించడానికి అవసరమైన పరికరాలన్నీ 150 స్టాటిక్ బృందాలతో పాటు.. 51 డీఆర్‌ఎఫ్ బృందాలకు అప్పగించారు. వర్షాకాలంలో పని చేసే ఈ బృందాలన్నిటికీ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి సేవల తీరును వివరించారు. ఈ బృందాలన్నీ ఆయా డివిజన్లలో ఉండి సేవలందిస్తాయి. ఆ డివిజన్ వరకూ ఎక్కడా ఇబ్బంది ఉన్నా వీరే సమస్యను పరిష్కరిస్తారు.
24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి: రంగనాథ్
వర్షం ఎప్పుడు వస్తుందో ఎంత మొత్తం లో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్(ఎంఈటీ) లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుం డా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షానికి ముందే రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నాలా లు, కల్వర్టులను పరిశీలించి వరద నీటి ప్రవా హం సాఫీగా సాగేలా జాగ్రత్తపడాలన్నారు.