03-07-2025 10:33:28 AM
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడుల మధ్య మాలిలో(Mali) ముగ్గురు భారతీయ పౌరుల అపహరణపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయులను(Indians Kidnap) అపహరించిన ఒక రోజు తర్వాత వారి విడుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ మాలి ప్రభుత్వాన్ని కోరింది. కేస్‌లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల అపహరణపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 1న సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ఆవరణలో సమన్వయంతో దాడి చేసి ముగ్గురు భారతీయులను బలవంతంగా బందీలుగా తీసుకెళ్లినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మాలి అంతటా జరిగిన సమన్వయ దాడులకు అల్-ఖైదా(Al Qaeda) అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (Jama'at Nasr al-Islam wal-Muslimin) బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయం సంబంధిత అధికారులు, స్థానిక చట్ట అమలు సంస్థలు, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వహణతో దగ్గరి కమ్యూనికేషన్‌లో ఉందని ఏంఈఏ తెలిపింది. అపహరణకు గురైన భారతీయ పౌరుల కుటుంబ సభ్యులతో కూడా మిషన్ సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.
"ఈ దారుణమైన హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం(Government of India) నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. అపహరణకు గురైన భారతీయ పౌరులను సురక్షితంగా, త్వరగా విడుదల చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కోరుతోంది" అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. భారతీయ పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వివిధ స్థాయిలలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మాలిలో నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని క్రమం తప్పకుండా అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఏంఈఏ సూచించింది. భారతీయులకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, అపహరణకు గురైన భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.