11-07-2025 12:59:11 AM
- 15 ఏళ్ల సమస్యకు పరిష్కారం
- అడ్డుగోడ తొలగింపుతో సుగమమైన మార్గం.. కిలోమీటర్ల దూరం ఆదా
- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 10 (విజయ క్రాంతి): హబ్సిగూడలో రెండు కాలనీల మధ్య అడ్డుగా ఉన్న గోడను తొలగించి, 15 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హైడ్రా శాశ్వత పరిష్కారం చూపింది. ఈ గోడ తొలగింపుతో నందనవనం, జయానగర్ కాలనీల మధ్య మార్గం సుగమం కావడంతో, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 6లో ఉన్న ఈ అడ్డుగోడ కారణంగా, నందనవనం కాలనీ వాసులు ప్రధాన రహదారికి చేరుకోవాలంటే సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులను కలిసినా, జయానగర్ కాలనీ అసోసియేషన్తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో, నందనవనంలోని కాంక్రీట్ ట్రంపెట్ అపార్ట్మెంట్ వాసులు హైడ్రాకు చెందిన ’ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా అధికారులు, గురువారం ఉదయం స్ట్రీట్ నంబర్ 6లోని అడ్డుగోడను కూల్చివేశారు. దీంతో ఇప్పుడు నందనవనం స్ట్రీట్ నంబర్ 4 నుంచి నేరుగా స్ట్రీట్ నంబర్ 6లోకి ప్రవేశించి, కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్న ఎన్జీఆర్‌ఐ మెట్రో స్టేషన్కు, హబ్సిగూడ ప్రధాన రహదారికి సులభంగా చేరుకుంటున్నారు. ‘పదిహేనేళ్ల మా కష్టాలు తీరాయి. కిలోమీటర్ల దూరం, ప్రయాణ భారం తగ్గింది. మా సమస్యను పరిష్కరించిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు,‘ అని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.