06-07-2025 01:13:26 AM
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ ప్రధాన కాంట్రాక్టులన్నీ వారికే కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఆ తర్వాత ఇచ్చిన వివరణ రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను కోవర్టులన్నది కాంట్రాక్టర్లను మాత్రమేనని నాయకులను కాదని.. ఈ వివాదంలో సీఎం రేవంత్‌రెడ్డిని లాగకండి అం టూ ఇచ్చిన వివరణ కూడా మరో లెవెల్‌లో ఉందని పొలిటికల్ కామెంట్స్ వినబడుతున్నాయి.
లాగవద్దంటూనే సీఎంను జడ్చర్ల ఎమ్మెల్యే బయటకు లాగుతున్నట్లు ఈ కామెంట్స్ ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేశారని..అనిరుధ్ వ్యాఖ్యలు పరోక్షంగా సీఎంను కూడా టార్గెట్ చేసినట్లే భావించాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే మంత్రుల అవినీతిపై వ్యాఖ్యలు చేసిన అనిరుధ్.. తాజాగా చంద్రబాబు అంశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయని, ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం కల్పించాయనే చర్చ జరుగుతోంది.
విజయభాస్కర్