04-05-2025 12:00:00 AM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్, కళ్యాఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కథానాయికగా ఇవానా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో హీరోయిన్ ఇవానా శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా ఇవానా చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే.. “ఇక్కడ అందరూ బుజ్జికన్నా అని పిలవడం ఆనందంగా ఉంది. అది ‘లవ్‌టుడే’లో నా పాత్ర పేరు. అభిమానులు తన క్యారెక్టర్ పేరుతో పిలవడం.. ఒక నటికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, కేతిక లాంటి అద్భుతమైన నటులు భాగమయ్యారు.. గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప సంస్థ నిర్మిస్తోంది. సహజంగా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
ఇందులో నా క్యారెక్టర్ డ్యాన్సర్ అని తెలిసి ఇంకా ఆనందమేసింది. ఇలా ఇవన్నీ.. నేను తెలుగు తెరకు పరిచయం కావడానికి ఇదే మంచి తరుణం అనిపించేలా చేశాయి. డైరెక్టర్ కార్తీక్ రాజు చెప్పిన కథను ఓకే చేశాను. తెలుగులో నాకిది తొలి ప్రాజెక్ట్. కచ్చితంగా శుభారంభం అవుతుందని భావిస్తున్నా. నా కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులో హరిణి అనే పాత్రలో కనిపిస్తా. ఆమె ఓ డ్యాన్సర్. ఇష్టమైన వాళ్లకోసం దేనికైనా సిద్ధపడుతుంది.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ డ్యాన్సర్ అనగానే మళ్లీ డ్యాన్స్ క్లాసెస్‌కెళ్లా. భరతనాట్యం నేర్చుకున్నా. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్. -ఈ సినిమా కోసం నేర్చుకోవాలనుకున్నా. సెట్స్‌లో తెలుగులో మాట్లాడడానికి చాలా ప్రయత్నించేదాన్ని. అందరూ సహకరించేవారు. -శ్రీవిష్ణు తెలుగు చాలా వేగంగా మాట్లాడుతారు. మొదట్లో ఆయన మాట్లాడుతుంటే అర్థమయ్యేది కాదు. మెల్లమెల్లగా అలవాటు పడ్డా. ఆయన చాలా కూల్ పర్సన్. చాలా సైలెంట్‌గా ఉంటారు.
కాస్త ఇంట్రోవర్ట్ అనిపిస్తారు. ఆయన నాకు డైలాగ్స్ రాసి ఇచ్చేవారు. ఆయన ప్రోత్సాహం ఎప్పుడూ మర్చిపోలేను. కేతికశర్మతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. కార్తీక్ తమిళ్ పర్సన్. ఆయనతో నేను తమిళ్‌నే మాట్లాడేదాన్ని. నాకు డ్రీమ్ రోల్, జోనర్ లాంటివి -ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పటివరకూ చెల్లిగా, ప్రియురాలిగా నటించా.
మున్ముందు నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు చేయాలనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నేను సినిమాలను సీరియస్‌గా తీసుకున్నది మాత్రం ‘లవ్‌టుడే’ తర్వాతే. ముందు చదువు పూర్తిచేయాలన్న ఉద్దేశంతోనే అలా చేశా. ఇప్పుడు కూడా మాస్టర్స్ చేస్తున్నా. -తమిళ్, తె లుగులో సినిమాలు చేస్తున్నా” అని చె ప్పారు.