20-11-2025 12:00:00 AM
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’. దుర్గాఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించారు. ఆయన ఈ సినిమాలో రుద్ర పాత్రలో థ్రిల్ చేయనుండటంతోపాటు రాముడిగానూ అలరించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 వేసవిలో విడుదల కానుంది.
ఈ ప్రాజెక్టు గురించి కథానాయకి ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలు తెలిపింది. కొన్నిరోజుల క్రితం సోషల్‌మీడియాలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పింది. “వారణాసి’లోని నా పాత్రకు తెలుగులో స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పనున్నాను. కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నాను. రాజమౌళి సహాయం తీసుకుంటూ తెలుగు మాట్లాడటం సాధన చేస్తున్నాను” అని తెలిపింది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కు ముందు నిర్వహించిన ఈ చిట్‌చాట్‌లో ‘ఒకవేళ వారణాసి ఈవెంట్లో తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే క్షమించాంలని ప్రియాంక కోరింది. అభిమానులు ఆశించినట్టే గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో ‘తగలబెట్టేద్దామా’, ‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లుండ్‌గా వెళ్లిపోతా’ అంటూ ప్రియాంక తన నోట తెలుగు పలుకులు పలికి అభిమానులను ఉత్సాహపరిచింది.
టైటిల్ వివాదంలో రాజమౌళి టీమ్
మహేశ్‌బాబురాజమౌళి కాంబో సినిమా టైటిల్ ‘వారణాసి’ అని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పోస్టర్, ట్రైలర్‌పైనా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్ ఆగకముందే ఈ మూవీ మేకర్స్‌ను ఇప్పుడు టైటిల్ వివాదం వెంటాడుతోంది. ఫిల్మ్ ఛాంబర్‌లో ‘వారణాసి’ టైటిల్ ఇంతకుముందే దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి రిజిస్టర్ చేయించారు.
ఆయన గతంలో ఆది సాయికుమార్‌తో ‘రఫ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనకు చెందిన రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ ఈ టైటిల్‌ను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకుంది. కానీ రాజమౌళి టీమ్ మాత్రం ఈ టైటిల్‌పై ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా నేరుగా ఈవెంట్‌లో ప్రకటించినట్టు తెలుస్తోంది.
ఒక టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే, అదే పేరుతో మరో సినిమాను ప్రకటించవద్దనే నియమాన్ని పట్టించుకోకుండానే రాజమౌళి టీమ్ టైటిల్‌ను ప్రకటించిందని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆయన నేరుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అందరి దృష్టి రాజమౌళి వైపు మళ్లింది. ఆయన టైటిల్ మార్చుతారా? లేక సుబ్బారెడ్డితో మాట్లాడి టైటిల్ హక్కులు తీసుకుంటారా? అనే చర్చ సాగుతోంది.