calender_icon.png 31 July, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక ప్రచారం చేయను

31-07-2025 12:29:39 AM

  1. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా నాకు ఒక్క పైసా రాలేదు
  2. ఈడీ విచారణకు హాజరైన సినీనటుడు ప్రకాశ్‌రాజ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): బెట్టింగ్స్ యాప్‌లతో తనకు పైసా రాలేదని, ఇక మీదట ప్రచారం చేయనని సినీనటుడు ప్రకాశ్‌రాజ్ చెప్పారు. బెట్టింగ్ యాప్‌లతో డబ్బు సంపాదించాలని ఎవరూ భావించవద్దని సూచించారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో బుధవారం ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాల యంలో దాదాపు ఐదు గంటల పాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రకాశ్‌రాజ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు.

‘జంగిల్’పై ప్రధాన దృష్టి

ప్రధానంగా జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రకాశ్‌రాజ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ యాప్ ప్రమోషన్‌లో ప్రకాశ్‌రాజ్ భారీగా నగదు తీసుకున్నట్లు ప్రచారం జరగడంతో, ఆ కోణంలో అధికారులు ఆరా తీశారు. అయితే జంగిల్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా నగదు కూడా రాలేదని ప్రకాశ్‌రాజ్ ఈడీ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. తాను 2016లో జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేశానని, కానీ ఆ యాప్ యాజమాన్యంతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని విచారణలో వెల్లడించారు.

దుబాయ్ లావాదేవీలు, భవిష్యత్తు ప్రమోషన్లపై వివరణ..

దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకాశ్‌రాజ్‌కు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఆయన్ని విచారించారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు వచ్చిన నగదును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రకాశ్‌రాజ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు పరిశీలించారు. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేయలేదని ప్రకాశ్‌రాజ్ ఈడీకి వివరించారు.

అలాగే భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని ఆయన అధికారుల ఎదుట స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ..‘బెట్టింగ్ ఆడి ఎవరూ మోసపోవద్దు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నాకు డబ్బులు అందలేదు. ఇకనుంచి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయను. నేను చెప్పిన విషయాలు ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు చెప్పలేదు’ అని తెలిపారు.

ఈడీ దర్యాప్తు ముమ్మరం.. 

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సూర్యాపేట, పంజాగుట్ట, మియాపూర్, ఏపీలోని విశాఖపట్నంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. జీత్‌విన్, జంగిల్ రమ్మీ, లోటస్ 365 వంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రముఖులు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైంది. వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్‌లో నగదు పోగొట్టుకొని మోసపోవడంతోపాటు కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు వేల కోట్ల డబ్బులు కొల్లగొట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈడీ మొత్తం 29 మంది సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. తెలంగాణ పోలీసులు ఇప్పటికే 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు హవాలా మార్గంలో పలువురికి నగదు పంపించారనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది.

విచారణకు హాజరుకానున్న ఇతర ప్రముఖులు..

ఈ కేసులో ఈడీ పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. నటుడు రానా దగ్గుబాటి జూలై 23న విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన గడువు కోరడంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ సూచించింది. అలాగే, ఆగస్టు 6న నటుడు విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న నటి మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఈడీ కేసులు నమోదైన వారిలో ముఖ్యులు..

రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాశ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి,అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బందరు శేషాయని సుప్రీత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, లోకల్ బాయ్ నాని తదితరులు ఉన్నారు.