16-07-2025 12:42:46 AM
అందోల్ జోగిపేట జాతీయ రహదారి విస్తరణ పనులు పరిశీలన
ఆందోల్(సంగారెడ్డి), జూలై 15(విజయక్రాంతి): అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ హబ్ గా మార్చనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన ఆందోల్ మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా పలు ప్రభుత్వ విద్యాసంస్థలు, నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్ గా మార్చనున్నట్లు తెలిపారు. అన్నిరంగాలలో అభివృద్ధి చేసి, విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రాజెక్టులు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఆందోల్ నియోజకవర్గంలోని కేజీబీవీ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ పాఠశాలలో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన ఆధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ బ్లాక్, విద్యార్థుల కోసం అందిస్తున్న భోజన మెనూ మొదలైన వసతులను సమీక్షించారు.
అనంతరం ఆందోల్ పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ పనులను, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఇతర వసతుల మంత్రి స్వయంగా పరిశీలించారు. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు పాలిటెక్నిక్ కాలేజీ కీలక పాత్ర పోషించనుందని మంత్రి వివరించారు.
జాతీయ రహదారి పనుల పరిశీలన.
నాందేడ్ జాతీయ రహదారి నుండి జోగిపేట-ఆందోల్ వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రహదారి పనులు పరిశీలించారు. అందోల్ ఫ్లైఓవర్ నుండి జోగిపేట పట్టణానికి చేరుకునే ప్రధాన మార్గంగా అభివృద్ధి చేస్తున్న ఈ రహదారి ప్రజలకు మెరుగైన రవాణా మౌలిక వసతులు అందించనుందన్నారు.
ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.