16-07-2025 12:41:12 AM
అక్రమ వెంచర్‌కు నోటీసులు అందజేసిన అధికారులు
కొండాపూర్, జూలై 15 : కొండాపూర్ మండలం మునిదేవునిపల్లిలో వెంచర్లో అక్రమంగా నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖ అధికారులు మంగళవారం పరిశీలించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నోటీసులు అందజేశారు. విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 12న సర్కారు భూమిలో అక్రమ వెంచర్ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.
మండల ఎంపీఈవో, గ్రామ కార్యదర్శి వెంచర్ నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడతో పాటు పూడ్చిన వాగులు, నాలాలు తెరవాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఆనుమతులు లేని వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. లేని పక్షంలో తామే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు.
మునిదేవుని పల్లి గ్రామంలో శ్రీ రిధి హాబిటేట్స్ ఎల్.ఎల్.సి రఘునాథ్ డెవలపర్స్ వెంచర్ అభివృద్ధి పనులు ఆపివేయాలని, సర్వే నెంబర్ 194, 196, 16, 92లో గేటెడ్ కమ్యూనిటీగా ప్రహరీ గోడ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సర్వేనెంబర్ 92లో రాత్రి వేళల్లో జేసీబీ, టిప్పర్ల సహాయంతో వెంచర్ లోకి మట్టిని అక్రమంగా తరలించడంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.