నేను పక్కా లోకల్!
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్‌లోకల్
నేను ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా
ప్రజాసమస్యలపై కోట్లాడుతున్నా
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
కరీంనగర్, మే 5 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు నాన్ లోకల్. నేను పక్కా లోకల్’ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్థలంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టిన. కేసీఆర్‌ను గద్దె దించిన. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోట్లాడుతున్నా’నని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ వార్ రూం ఏర్పాటు చేసుకుని తన ఫోన్‌తో సహా ఎంతోమంది ఫోన్లు టాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసుల అదుపులో ఉన్న అధికారులు వెల్లడిస్తున్నారన్నారు. పోలీసులు ముందు కేసీఆర్, కేటీఆర్‌నూ అరెస్ట్ చేయాలన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీపై కుట్రలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే కరీంనగర్‌కు రూ.కోట్లు పంపించి కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఒక్కో కార్పొరేటర్ ఖాతాలో రూ.5 లక్షల చొప్పున జమ చేశారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలపై ఈసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను ప్రజాసమస్యలపై కోట్లాడానని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఏనాడూ ప్రజాక్షేత్రంలోకి రాలేదన్నారు. అనంతరం మున్నూరు కాపు సంఘం నాయకులు భవన నిర్మాణానికి సాయం అందించాలని బండి సంజయ్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.




