calender_icon.png 3 February, 2026 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌పై నిషేధం?

03-02-2026 01:17:37 AM

త్వరలో ఐసీసీ మీటింగ్

పీసీబీకి ఇప్పటికే వార్నింగ్

వెనక్కి తగ్గని పాక్ బోర్డు

ఆర్థికంగానూ తీవ్ర నష్టం

టీ20 ప్రపంచకప్ జరుగుతుందంటే ఎవరు ట్రోఫీ గెలుస్తారు.. ఏ టీమ్ సంచలనాలు సృష్టిస్తుంది.. ఏ బ్యాటర్ చెలరేగిపోతాడు.. ఇవే ప్రశ్నలు వినిపిస్తుంటాయి..కానీ ఈ సారి అసలు కంటే ఇతర అంశాలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అటు ఐసీసీ సీరియస్ అయింది. పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో పాక్‌పై కఠిన చర్యలకు ఐసీసీ సిద్ధమవుతోంది. దీని కోసం ఒకటిరెండు రోజుల్లో ఐసీసీ కీలక సమావేశం జరగనుండగా.. ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

దుబాయ్, ఫిబ్రవరి 2 : భారత్‌తో మ్యాచ్ బహిష్కరించనున్నట్టు  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాలను కుదిపేస్తోంది. తమకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌కు మద్ధతుగా అంటూ పీసీబీ చెబుతున్న వాదనతో ఐసీసీ ఏకీభవించడం లేదు. నిజానికి వరల్డ్‌కప్ లాంటి మెగాటోర్నీలో నచ్చిన మ్యా చ్‌లు ఆడతాం లేకుంటే బహిష్కరిస్తాం అంటే కుదరదు. ఎందుకంటే అది ఐసీసీ పరిధిలో జరిగే టోర్నీ. అందుకే పాక్ ప్రభుత్వం పీసీబీకి ఆదేశించామంటూ ట్వీట్ చేసిన వెంటనే ఐసీసీ స్పందించింది. తమకు అధికారకంగా పాక్ బోర్డు నుంచి సమాచారం రాలేదని చెబుతూనే పీసీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

మీ ఇష్టమొచ్చినట్టు నచ్చిన మ్యాచ్‌లు ఆడతామంటే కుదరదని, ఇదే మీ గల్లీ క్రికెట్ టోర్నీ కాదని హెచ్చరించింది. ఇది సరైన పద్ధతి కాదని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం గ్లోబల్ క్రికె ట్‌కు విరుద్ధమని, దీని వల్ల భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకూ పీసీబీ నుంచి అధికారిక సమాచారం లేదని, అయి తే ఇష్టమొచ్చిన మ్యాచ్‌లు ఆడడం, మిగిలిన వాటిని బహిష్కరించడం సరైనది కాదని మాత్రం స్పష్టం చేసింది. పాక్ ప్రభుత్వ జోక్యాన్ని కూడా ఐసీసీ తప్పుపట్టింది. ఇది పాక్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముందని పేర్కొంది.

ఐసీసీ తీసుకునే చర్యలు ఇవే 

ఐసీసీని ధిక్కరిస్తూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్ భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు పూర్తి బాధ్యత పాక్ బోర్డుదే. ఐసీసీ తీసుకునే చర్యలను చూస్తే టీ20 ప్రపంచకప్ నుంచి నిషేధించే అవకాశముంటుంది. అలాగే ఆసియాకప్‌లో పా ల్గొనకుండా కూడా నిషేధిస్తారు.పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడకుండా ఆంక్షలు విధించడం, వారికి ఎన్‌వోసీ ఇవ్వకుండా ఆయాదేశాల బోర్డులకు ఆదేశాలివ్వ డం జరుగుతుంది.

అలాగే ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం వాటాను పాక్ క్రికెట్ బోర్డు కోల్పోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా పాక్ క్రికెట్‌ను నిర్వీర్యం చేయొచ్చు. ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతోంది. పాక్ ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనకుండా ఇతర దేశాలను నియంత్రించే అధికారం కూడా ఐసీసీకి ఉంటుంది. అందుకే ఈ సమస్యను తెగే వరకూ లాక్కుండా పాక్ బోర్డుకు ఇప్పటికే ఐసీసీ వార్నింగ్ రూపంలో కీలకమైన సూచనలు చేసింది.

స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లకు భారీ నష్టం 

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వరల్డ్‌కప్ లాంటి టోర్నీ ల్లో అయితే అభిమానులకు పండగే. స్టేడి యం హౌస్‌ఫుల్.. ఇటు టీవీలకు ఫ్యాన్స్ అతుక్కుపోతారు. ఇక స్పాన్సర్లకు, బ్రాడ్‌కాస్టర్లకు, ఐసీసీకి సైతం ఈ మ్యాచ్ కాసుల వర్షం కురిపిస్తుంది. అలాంటి క్రేజ్ ఉన్న మ్యాచ్‌కు ఇప్పుడు పాక్ జట్టు దూరమైతే తీవ్రంగా నష్టపోయేది బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్స ర్లే. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్ అడ్వర్టుజ్‌మెంట్ల కోసం స్లాట్లను భారీ ధరలకు విక్రయించుకుంది. అటు స్పాన్సర్లు కూడా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించారు. దీంతో మ్యాచ్ జరగకుంటే నిండా మునిగిపోవడం ఖాయం. అయితే ఐసీసీ నుంచి పాక్ బోర్డుకు వచ్చే రెవెన్యూ వాటాతో తమ నష్టాలను భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారమే కొలంబోకు భారత్ 

పాకిస్థాన్ నిర్ణయం ఎలా ఉన్నా వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారమే భారత క్రికెట్ జట్టు కొలంబోకు వెళ్ళనుంది.గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాక్‌తో మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది. దీని ప్రకారం ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థితో పోరు కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. ఒకవేళ పాక్ మ్యాచ్ ఆడకున్నా టీమిండియా మాత్రం ఐసీసీ ప్రోటోకాల్‌ను పూర్తిగా పాటించనుంది. దీని ప్రకారం కొలంబోకు వెళ్లి రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది. మ్యాచ్‌కు ముందు రోజు జరిగే మీడియా సమావేశానికి కెప్టెన్ లేదా కోచ్ హాజరవుతారు. మ్యాచ్ రోజు స్టేడియానికి వెళుతుంది.

టాస్ సమయానికి తుది జట్టు జాబితాలో సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్‌లోకి వెళతాడు. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారంఒక జట్టు టాస్‌కు హాజరుకాకుంటే ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ ఇస్తారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్‌కు రాకపోతే మ్యాచ్ రిఫరీ వాకోవర్ ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. పాక్ జట్టు నిర్ణయం ఎలా ఉన్నా ఐసీసీ నిబంధనలనే భారత జట్టు అనుసరిస్తుందని, కొలంబోకు వెళుతుందని బోర్డు తెలిపింది.

పాక్‌కే ఎక్కువ నష్టం

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం జరగనుంది. మెగాటోర్నీలో 2 కీలక పాయింట్లు కోల్పోవడంతో పాటు నెట్ రన్‌రేట్‌పైనా ప్రభావం పడుతుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం బాయ్‌కాట్ చేసిన మ్యాచ్‌లో 20 ఓవర్ల పూర్తి స్కోరును లెక్కలోకి తీసుకుంటారు. దీంతో పాక్ రన్‌రేట్ భారీగా పడిపోవడం, తర్వాతి రౌండ్‌కు వెళ్లే అవకాశాలపై ప్రభావం చూపడం ఖాయం. ఇదిలా ఉంటే ఆర్థికంగానూ పాక్ బోర్డుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ మ్యాచ్ ద్వారా భారీ ఆదాయంపై ఆశలు పెట్టుకున్న బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు ఆ నష్టాన్ని పాక్ బోర్డు నుంచే వసూలు చేయనున్నారు. దీని కోసం ఐసీసీ సాయం తీసుకుని వారికి వచ్చే రెవెన్యూలో మినహాయించుకునే పరిస్థితి ఉంటుంది.