calender_icon.png 14 November, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గుట్ట’కు గుట్టుగా కరెంట్

14-11-2025 01:09:22 AM

  1. మైనింగ్ వ్యాపారానికి అక్రమంగా వాడకం
  2. విద్యుత్ చౌర్యం తెలిసినా చర్యలకు వెనకడుగు
  3. చూడనట్లు వదిలేసిన ట్రాన్స్ కో అధికారులు

షాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి): అడిగే నాథుడే ఉండబోరని కాబోలు గ్రానైట్ ను తొలించేందుకు గుట్టకు గుట్టుగా విద్యుత్ ను వాడేస్తున్నారు. సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ట్రాన్స్ కో అధికారులు అక్రమ మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా మొయినా బాద్ మండలంలో గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు.

రాతిబండ్లను తోలుస్తూ గ్రానైట్ వ్యాపారం గుట్టుగా సాగిస్తున్నారు. కొంతకాలంగా ఈ వ్యాపారం నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పే అధికారులు విద్యుత్ చౌర్యం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవదంలో వెనుకంజ వేస్తున్నారనే విమర్శలున్నాయి. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ఓ అసైన్డ్ భూమిలో ఉన్న గుట్టరాళ్లను చదును చేయడానికి అక్రమ మైనింగ్ పనులను కొంతకాలంగా నిర్వహిస్తున్నారు.

అయితే ఈ అక్రమ మైనింగ్ పనులు చేయడానికి ఎట్లాఎర్రవల్లి, మక్తగూడ, నగర్ కుంట గ్రామ రహదారిని ఆనుకుని ఉన్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి దర్జాగా విద్యుత్ లైన్ ను అక్రమంగా తీసుకెళ్లారు. అయితే ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ విషయాన్ని కొందరు అధికారు ల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది విద్యుత్ వైర్లను తీసుకెళ్లిపోయినట్లు తెలిసింది.

మరి ఇంతకాలం అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని విద్యుత్ చౌర్యం చేసిన విషయం లో విద్యుత్ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారా? జరిమానాలు వేశారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేసులు నమోదు చేయ కుంటే వారికి ఎందు కు మినహాయింపు ఇచ్చారో విద్యుత్‌శాఖ అధికారులకే తెలియాలి. బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పే అధికారులు విద్యుత్ చౌర్యం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవదంలో వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.