06-05-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 5: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే అది పాక్‌కే ఎక్కువ నష్టమని మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరించిం ది. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా త్రం భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వృద్ధిరేటు మరింత మందగించడం, ప్రభుత్వం నిధుల సమీకరించే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయని నివేదికలో స్పష్టం చేసింది.
అంతేకాకుండా బయటి నుంచి అప్పులు పుట్టడం కష్టతరమవుతుందని, ఇప్పటికే తక్కువగా ఉన్న విదేశీ మారక నిల్వలు మరింతగా కరిగిపోతాయని హెచ్చరించింది. విదేశీ రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఈ నిల్వలు సరిపోని ప్రమాదం ఉందని తెలిపింది. ఇన్ని ఆర్థిక సవాళ్ల మధ్య అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విధించిన కఠిన నిబంధనలను కూడా పాకిస్థాన్ పాటించాల్సి ఉంటుందని మూడీస్ స్పష్టం చేసింది.
ఇక భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని మూడీస్ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు నాణ్యంగా ఉండటం, ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండటం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్నాయని పేర్కొంది.
ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల భారత ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, పాక్‌తో భారత్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలు కేవలం 0.5 శాతం కావడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడింది. రాజకీయ పరిస్థితుల దృశ్యా ఇరుదేశాల మధ్య సైనిక ప్రతిస్పందనలు పరిమిత స్థాయిలో ఉండవచ్చని, అప్పుడప్పుడు ఉద్రిక్తతలు పెరిగా అవి పెద్ద స్థాయి సైనిక ఘర్షణకు దారితీయకపోవచ్చని మూడీస్ అంచనా వేసింది.