06-05-2025 12:42:24 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి) : యువత ఏ రంగంలో రాణించాలన్న నైపు ణ్యం ఎంతో అవసరం. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో నైపుణ్యముంటేనే కోరుకున్నట్టుగా ఉపాధి, వేతనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారు ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
కరోనా విలయం తర్వాత ఐటీ రంగంలో కొలువులు సాధించడం కొంత కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు సైతం నైపుణ్యం పెంపొందించుకునే దిశ గా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్స్‌కి కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి.
కానీ, వేతన ప్యాకేజీలు చాలా తక్కువగా ఉంటున్నాయని ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనాల పెంపు అంశం నైపుణ్యంపైనే ఆధారపడి ఉందని కెరీర్ ప్రోగ్రెషన్ రిపోర్ట్ 2024--25 నివేదిక ద్వారా వెల్లడించింది. అదనపు నైపుణ్యాలు కలిగివుంటే తక్కువ అనుభవం ఉన్న వారికి సైతం ఆయా కంపెనీలు వేతనాలు భారీగా చెల్లిస్తున్నాయని తెలిపింది.
నైపుణ్యముంటే మెరుగైన వేతనం..
ఐటీ, టెక్ రంగంలో ఉద్యోగం అంటే లక్షల్లో వేతన ప్యాకేజీ ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో లక్షల్లో ప్యాకేజీ ఇచ్చి విద్యార్థులను కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయని ప్రకటన ల్లోనూ చూస్తుంటారు. కానీ చాలా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఫ్రెషర్స్‌కి ప్యాకేజీ ప్రారంభ దశలో రూ. 4 లక్షల వరకే ఉంటోంది.
కానీ మెరుగైన వేతన ప్యాకేజీ దక్కించుకోవాలంటే అధునాతన నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిరిగా మారిం దని ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ ఓ నివేదికలో తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి వాటిని నేర్చుకంటే వేతన ప్యాకేజీని భారీగా పెంచుకోవచ్చని పేర్కొంది.
ఫ్రెషర్స్‌లోనూ మూడేళ్ల అనుభవం ఉన్న వారిలో కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే వారి జీతం 139 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. వార్షిక వేతనం రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల స్థాయికి చేరినట్లు వెల్లడించింది. వాస్తవానికి ఐటీ రంగంలో సీనియర్ల కంటే ఫ్రెషర్లకే వేతనాల పెంపు అధికంగా ఉంది.
ఫ్రెషర్స్‌తో పోలిస్తే సీనియర్లు వేతనాల వృద్ధిలో వెనుకబడుతున్నారు. కెరీర్ ప్రోగ్రెషన్ రిపోర్ట్ ప్రకారం 3- నుంచి 8 ఏళ్ల వరకు అనుభవం ఉన్న ఉద్యోగుల వేతనాల్లో 93 శాతం పెరుగుదల ఉందని, 8- నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్లు అదనపు నైపుణ్యాలు నేర్చుకుంటే వారి వేతనాల్లో 50 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపింది.
వారి వార్షిక వేతనం రూ.19 లక్షలుగా ఉండగా నైపుణ్యాలు పెంచుకున్న తర్వాత ఏకంగా రూ.29 లక్షలకు పెరిగినట్లు వెల్లడించింది. ఇక 12 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న ఉద్యోగుల వార్షిక వేతనం 41 శాతం వృద్ధితో రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షల పైకి చేరినట్లు తెలిపింది.
నైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి వృత్తి పరంగానూ ఎదుగుదల ఉంటుంది. దాదాపు రెండేళ్లలో 80 శాతం మంది ఐటీ నిపుణులు తమ కెరీర్‌లో సానుకూల పరిణామాలు కనిపించాయని చెప్పినట్టు నివేదికలో తేలింది. వీరిలో 74 శాతం మంది ప్రమోషన్లు సైతం పొందగా, కొత్త ఉద్యోగాలు, కంపెనీలకు మారి నాయకత్వ స్థానాలకూ కొందరు చేరారు.
డేటా సైన్స్, ఏఐ వంటి రంగాల్లో వ్యక్తిగత ఆసక్తితో 22 శాతం మంది అదనపు నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. 13 శాతం మందే తమ జీతాలు పెరుగుతాయని ఆసక్తితో నేర్చుకుంటున్నారని నివేదిక వెల్లడించింది.
నైపుణ్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు..
యువతకు ఉపాధి లభించాలంటే నైపుణ్యాభివృద్ధి అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతలో నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది. పదుల సంఖ్యలో కోర్సులను ప్రారంభించి ఆసక్తి గల యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఏటా వందల కోట్లు వెచ్చిస్తూ ఉపాధి కల్పనలో యువత పక్షాన నిలబడుతుంది. కేవలం ఐటీ రంగంలోనూ కాకుండా ఇతర రంగాల్లోనూ నైపుణ్యాన్ని పెంచుకునేలా పలు కోర్సులు ప్రవేశపెట్టి యువతకు శిక్షణ ఇస్తున్నది. ఏడాదికి దాదాపు 2 వేల మందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నది.
నైపుణ్య లేమితో ఉపాధికి దూరమవుతున్న యువతకు బాసటగా నిలుస్తున్నది. నైపుణ్యమున్న మానవ వనరులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపేలా యువతను ప్రోత్సహిస్తున్నది. నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉండటంతో ప్రపంచస్థాయి కంపెనీలు సైతం తెలంగాణకు క్యూ కడుతున్నాయి.