06-05-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 5: జమ్మూలోని జైళ్లలో మగ్గుతున్న ఉగ్రవాదులను విడిపించుకునేందుకు జైళ్లపై దాడి చేయాలని పలు సంస్థలు భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సోమవారం భద్రతా దళాలను హ్చెరించాయి. దీంతో జైళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఉగ్రవాదులను జైళ్లలో ఉంచి ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం జమ్మూజైళ్ల భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) పర్యవేక్షిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ లభ్యం
పూంచ్ జిల్లాలో జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఇంప్రోవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (ఐఈడీ)ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని సూర్నకోటే అటవీప్రాంతంలో సోదాలు చేస్తున్న దళాలకు టిఫిన్ బాక్సుల్లో, స్టీల్ బకెట్లలో ఉంచిన ఐఈడీ లభించింది.
పదకొండో రోజూ అదే తీరు..
సరిహద్దుల వెంట పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. వరుసగా పదకొండో రోజు కూ డా పాక్ రేంజర్లు సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కు ప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెం ధర్, నౌషేరా, సుందర్‌బని, అక్నూర్ సరిహద్దుల వెంట కాల్పులకు దిగారు. ఆదివారం రాత్రి సమయంలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగగా.. మన జవాన్లు దీటుగా స్పందించి తిప్పి కొట్టారు.
డ్యామ్‌ల సామర్థ్యం పెంపు!
ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్‌ను దెబ్బకొట్టిన భారత్ ఆదివారం బాగ్‌లిహార్ డ్యామ్ నుంచి నీటి విడుదలను నిలిపివేసింది. తాజాగా సలాల్ డ్యామ్‌ను కూడా మూసేసిన ఇండియా ఈ డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు డ్యాములను భారత్ హైడ్రో పవర్ కోసం నిర్మించింది. ఈ వార్తలు కనుక నిజమైతే పాక్‌కు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
పారిపోతూ అనుమానిత ఉగ్రవాది మృతి
లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న 23 ఏండ్ల ఇంతియాజ్ అహ్మ ద్ పారిపోతూ నీటిలో మునిగి మరణించాడు. అహ్మద్‌ది జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా. అహ్మద్‌ది కస్టోడియల్ డెత్ అని కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా.. అటువంటిదేం లేదని పోలీసులు చెబుతున్నారు.
తనకు లష్కర్ గురించిన సమాచారం తెలుసని ఒప్పుకున్న ఇంతి యాజ్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. ఏప్రిల్ 23న జరిగిన ఎన్‌కౌంటర్ ప్రాం తానికి పోలీసులు తీసుకెళ్లగా ఇంతియాజ్ పారిపోయాడని, ఆ క్రమంలోనే నీటిలో మునిగి మరణించాడని పోలీసులు చెబుతున్నారు.
భారత్‌లోకి చొరబడ్డ మరో పాకిస్థానీ..
భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డ పాకిస్థాన్ పౌరుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆదివారం రాత్రి పంజాబ్ గురుదాస్‌పూర్ ఏరియాలో హుస్సేన్ అనే పాకిస్థాన్ వ్యక్తి చొరబాటుకు యత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు స్థానిక పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే ఓ పాక్ రేంజర్ భారత్‌లోకి వచ్చేందుకు యత్నించి బీఎస్‌ఎఫ్ జవాన్లకు చిక్కాడు.