31-12-2025 01:48:53 AM
కుటుంబ కలహాలతో బీఆర్‌ఎస్‌పై నమ్మకం పోయింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ర్టంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే అధికారం బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. బీఆర్‌ఎస్ కుటుంబ కలహాలతో ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతో రాష్ర్టంలో బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు.
మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాంచందర్‌రావు కలిసి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత విషయాలతోపాటు సర్పంచ్ ఎన్నికలు, ఫలితాలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను రాబట్టిందని నడ్డాకు రాంచందర్‌రావు వివరించారు. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగి అధికారంలోకి వస్తుందని, అందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పని చేయాలని నడ్డా సూచించారు. బీజేపీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గణనీయంగా సర్పంచులు వార్డ్ మెంబర్లు గెలవడం పట్ల నడ్డా అభినందనలు తెలిపారు.