26-06-2025 12:59:15 AM
- కన్న బిడ్డలే కాలయములు
- మరణ శాసనమవుతున్న మంచి మాటలు
- మానుకోటలో వరుస ఘటనలు
మహబూబాబాద్, జూన్ 24 (విజయ క్రాంతి): మంచి మాటలు చెబితే మట్టు పెడుతున్నారు. బిడ్డల్ని కని పెంచి పెద్ద చేస్తే తాము బతికినంత కాలం అండదండగా ఉంటారని భావించి, పెడదారి పట్టకుండా నాలుగు మంచి మాటలు చెప్పడం ఇప్పుడు తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది. కన్న బిడ్డలే కాలయములై తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న ఘటనలు మానుకోట జిల్లాలో ఇటీవల వరుసగా చోటు చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
జిల్లాలోని మరిపెడ మండలం డీ ఎస్ ఆర్ జెండాల తండాలో ఈనెల 16న ధరావత్ కిషన్ (40) తన చిన్న కూతురు పల్లవి నరేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఫోన్లో మాట్లాడుతుండగా గమనించిన తండ్రి ఇది సరికాదని, సదరు వ్యక్తి ప్రవర్తన సరిగా లేదని, అతనితో ప్రేమ వ్యవహారం తగదని కూతురు పల్లవిని హెచ్చరించాడు. తండ్రి అభ్యంతరంతో తన పెళ్లి కాదని భావించిన పల్లవి తన ప్రియుడు భూక్యా నరేష్, తన తల్లి కావ్య, అక్క రమ్య, ప్రియుడు నరేష్ స్నేహితులు బోడ చందు, దేవేందర్ కలిసి కిషన్ ను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని తల్లి సాంకి వచ్చి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మం తీసుకెళ్తుండగా మరణించాడు.
తల్లిని మట్టు బెట్టిన కూతురు
తన ప్రేమకు అడ్డుపడుతోందని ప్రియుడు, ఆమె సోదరుడు కలిసి తల్లిని కడ తేర్చిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సంస్కృతిక సారధి సభ్యురాలిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో నిధులు నిర్వహిస్తోంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు కాగా భర్త మరణంతో ఇద్దరు పిల్లలను తానే ఒంటి చేత్తో పెంచి పోషిస్తుంది.
పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె నల్గొండ జిల్లా కట్టంగూరు కు చెందిన శివ అనే 19 యువకుడితో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన బిడ్డ చిన్నతనంలోనే ప్రేమలో పడి భవిష్యత్తు పాడు చేసుకుంటుందని భావించిన తల్లి బిడ్డను గట్టిగా మందలించింది. దీనితో అంజలి బిడ్డ ప్రియుడుతో ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లి అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసి పారిపోయిన ఇద్దరిని పట్టుకొని అంజలిని తల్లికి అప్పగించారు. దీనితో ఇక తన తల్లి ఉన్నంతకాలం తన ప్రేమకు అడ్డుగా ఉంటుందని, కక్ష పెంచుకున్న బిడ్డ కన్నతల్లిని ప్రియుడు శివ అతని సోదరుడు మైనర్ బాలుడు తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.
రెండు రోజుల క్రితం తల్లిని ప్రియుడు అతని సోదరులతో కలిసి మెడకు చున్నితో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మృతురాలు అంజలి పుట్టినిల్లు ఇనుగుర్తి కి పార్థివ దేహాన్ని తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ రెండు సంఘటనల్లో మృతులు కన్న తల్లిదండ్రులు కాగా, హత్య చేసింది కడుపున పుట్టిన పిల్లలే కావడం గమనార్హం. మంచి భవిష్యత్తుకొని పిల్లలకు మంచి మాటలు చెప్పడం తల్లిదండ్రులను పాలిట శాపంగా మారింది. సభ్య సమాజం ఈసడించుకునే విధంగా తల్లిదండ్రులను హత్య చేసిన పిల్లలు తయారవుతున్నారు. మంచి కోరి చెబితే దారి తప్పకుండా మంచి దారిలో నడిచేందుకు ప్రయత్నించాల్సిన పిల్లలు ఇలా కన్న వారిని కడ తేర్చిన ఘటనలు మానుకోట జిల్లాలో ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.