03-01-2026 12:47:23 AM
ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు
నెదర్లాండ్స్‌కు చెందిన ఆప్టివర్ సంస్థలో భారీ ఆఫర్
కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ ఘనత
ఇంటర్నిషిప్‌లో ప్రతిభ చూసి వరించిన ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 2 (విజయక్రాంతి): ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి ఈ విద్యార్థే నిదర్శనం. చదువులో చురుకు.. సాంకేతికతలో మక్కువ.. వెరసి కార్పొరేట్ ప్రపంచం అతడికి బ్రహ్మరథం పట్టింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వేదికగా మరోసారి రికార్డు స్థాయి నియామకం జరిగింది. ఈ విద్యాసంవత్సరం (2025 ప్రాంగణ నియామకాల్లో కంప్యూటర్స్ అండ్ ఇంజినీరింగ్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్ఘీస్(21) అనే విద్యార్థి ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో సంచలనం సృష్టించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఐటీ హైదరాబాద్ స్థ్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక విద్యార్థికి దక్కిన అత్యధిక ప్యాకేజీ ఇదే కావడం విశేషం.
ఆ ఒక్కడికే రూ.2.5 కోట్లు
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్.. తన ప్రతిభతో కార్పొరేట్ దిగ్గజాలను మె ప్పించాడు. అంతకుముందు ఇదే ఆప్టివర్ సంస్థలో ఎడ్వర్డ్ రెండు నెలల పాటు ఇంటర్నిషిప్ చేశాడు. ఆ సమయంలో అతడి పని తీరు, సాంకేతిక నైపుణ్యాలను గమనించిన సంస్థ, యాజమాన్యం.. అతడిని వదులుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు ముందే ప్రీ-ప్లేస్‌మెం ట్ ఆఫర్ కింద రూ.2.5 కోట్ల వార్షిక వేతనం తో ఉద్యోగాన్ని ఖరారు చేసింది. ఎడ్వర్డ్ ఈ ఏడాది జూలైలో నెదర్లాండ్స్‌లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 2017లో ఓ విద్యార్థికి రూ.కోటి, మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి రూ.1.1 కోట్ల ప్యాకేజీ సాధించారు. కానీ, ఎడ్వర్డ్ రూ.2.5 కోట్లతో కొత్త చరిత్ర లిఖించాడు.
హైదరాబాద్ టు నెదర్లాండ్స్.. అకడమిక్ టాపర్
ఎడ్వర్డ్ నాథన్ నేపథ్యం పరిశీలిస్తే అతడు ఆద్యంతం మెరిట్ విద్యార్థేనని స్పష్టమవుతోంది. ఎడ్వర్డ్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లే కావడం ఆయనకు అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 2022లో జరిగిన జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 1,100 ర్యాంక్ సాధించగా, జేఈఈ అడ్వాన్డ్స్‌లో ఏకంగా 558వ ర్యాంక్‌తో సత్తా చాటాడు. కేవలం ఇంజినీరింగ్‌లోనే కాకుండా, మేనేజ్‌మెంట్ రంగంలోనూ ప్రతిభ కనబరిచాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 99.96 పర్సంటేజీ సాధించడం విశేషం.
2021లోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్స్ స్కాలర్‌షిప్‌ను దక్కించుకున్నాడు. అలాగే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో కేవీపీవై (కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన) ఫెలోషిప్‌ను కూడా సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువుపై ఎంతో శ్రద్ధ చూపే ఎడ్వర్డ్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించడం పట్ల ఐఐటీ హైదరాబాద్ వర్గాలు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.