03-01-2026 12:36:53 AM
హైదరాబాద్, జనవరి ౨ (విజయక్రాంతి): గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేసేందుకు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విజయ తెలంగాణ డెయిరీ సమగ్రమైన ప్రణాళికలు అమలు చేస్తున్నది. తద్వారా మహి ళల స్వయం ఉపాధికి చేయూతనిస్తున్నది. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగం గా డెయిరీ యాజమాన్యం తన వ్యాపారంలో మహిళా స్వయం సహాయక సం ఘాల (ఎస్‌హెచ్‌జీ) భాగస్వాములను చేసింది.
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (టీజీడీ డీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి,సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ప్రత్యేక చొరవ తీసుకుని మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇప్పటికే సోలార్ ప్లాం ట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణలో దూసుకుపోతున్న మహిళా సంఘాలు తాజాగా డెయిరీ రంగంలోనూ తమ హవా కొనసాగిస్తున్నాయి. విజయ డెయిరీ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాలే గ్రామస్థాయిలో పాల సేకరణ ప్రక్రియ చేపడుతున్నాయి.
దీనిలో భాగంగానే యాజమాన్యం పదో తరగతి విద్యార్హత కలిగిన మహిళా సభ్యులను ‘పాల మిత్రలు’గా నియమిస్తున్నది. వీరు గ్రామస్థాయిలో పాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. అందుకు పాలమిత్రలకు టీజీడీడీసీఎఫ్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. అక్కడ శిక్షణ పొందిన వారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రూప్ సభ్యురాలు రోజుకు సగటున 100 లీటర్ల పాలను సేకరిరించి వారు స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్యలు చేపడతాయి.
ప్రభుత్వ సహాయ సహకారాలు..
ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం పటిష్టమైన ఆర్థిక, సాంకేతిక సహాయ సహకారాలు అందిస్తున్నది. గ్రామీణ స్థాయిలో పాల సేకరణకు అవసరమైన సౌకర్యాల కోసం శ్రీనిధి ద్వారా రుణాలు అందజేస్తున్నది. అలాగే బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు నాబార్డ్ సహకారంతో మైక్రో ఏటీఎంలను కూడా ఏర్పాటు చేస్తున్నది. పాల సేకరణ, నిర్వహణ ఖర్చులకు గాను లీటరుకు రూ.2 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. మహిళా సంఘాల సభ్యులు ఈ నిధులను రవాణా, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు, మరమ్మతుల కోసం వినియోగిస్తున్నారు.
నిర్దేశిత లక్ష్యాలు..
పాల విక్రయాల పరంగాప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. దీనిలోభాగం గా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నది. జూన్ 2025 నుంచి ఇప్పటివరకు 375 పార్లర్లు అందుబాటులోకి వచ్చాయి. గడచిన మూడు నెలల్లోనే మరో 45 కొత్త పార్లర్లను మంజూరయ్యాయి. ప్రజల రద్దీ ఎ క్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, మున్సిపల్ పార్కుల వద్ద పార్లర్లు అందుబాటులోకి వస్తున్నాయి.
కేంద్రాల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన పాలతోపాటు పాల ఉత్పత్తులు తక్కువ ధరకే అం దుబాటులోకి వస్తున్నాయి. ఉత్పత్తుల విక్రయంపై 10 నుంచి 20 శాతం వరకు లాభం పొందే అవకాశం ఉంది. రోజుకు సుమారు 100 లీటర్ల పాలు, ఇతర ఉత్పత్తుల అమ్మకం జరిగితే, నెలకు రూ.15,000 నికర ఆదాయం లభిస్తుందని అంచనా. పార్లర్లను సమర్థంగా పర్యవేక్షించేందుకు టీజీడీడీసీఎఫ్ వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నది.