03-01-2026 12:43:46 AM
* మూసీ బ్యూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ప్రాజెక్టు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? సీఎం రేవంత్ అసలు ఉద్దేశం మూసీలో మూటల వేట మాత్ర మే. మళ్లీ మూసీ ప్రాంత ప్రజలను కాటువేసేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోం.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపైన, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్న రేవంత్‌రెడ్డి రాత్రికి రాత్రి మూసీ ప్రాజెక్టు గే ట్లు ఎత్తి మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను ముంచెత్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూ సీ ప్రక్షాళన అంశంపై అన్ని అబద్దాలు వల్లె వేశారని, తన అవినీతి ప్రణాళికలను, కుట్రలను ప్రజల ముందు ఉంచారని అన్నారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలేసి మూసీ బ్యూ టిఫికేషన్ పేరిట లక్షన్నర కోట్ల లూటీకి ము ఖ్యమంత్రి రేవంత్ తెరలేపారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్, మూసీని ఆనుకుని నివసించే లక్ష మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తామని అధికా రికంగా ప్రకటించారని కేటీఆర్ ధ్వజమెత్తా రు. కాంగ్రెస్ సర్కారు అంటే కూల్చివేతలు త ప్ప నిర్మాణాలు కాదని మరోసారి తేలిపోయిందని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. కలుషితమైన మూసీ కన్నా ముఖ్య మంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతోందని ధ్వజమెత్తారు. ఓవైపు 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టి, ఇప్పటికిప్పుడు బ్యూటిఫికేషన్ చేపట్టాలనుకోవడం వెనక అసలు ఉద్దేశం మూసీలో మూటల వేట మాత్రమే అని వెల్లడించారు.
పేదల ఇళ్లు ఎందుకు కూల్చారు..
రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల పట్టపగలే హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లు సేఫ్ సిటీగా ఉన్న రాజధానిని క్రైం సిటీగా మార్చిన రేవంత్, మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీకి కేంద్రంగా మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ము ఖ్యమంత్రి మరి డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు.
మూసీ మాస్టర్ ప్లాన్ తయా రీ కాంట్రాక్టును మెయిన్ హార్ట్ కు అప్పగించడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో అనేక మంది మంత్రులు అక్రమంగా కట్టిన గెస్టు హౌజుల్లో ఏ ఒక్కదాని వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోని ముఖ్యమంత్రి, పేదల ఇళ్లను మాత్రం కనీస కనికరం లేకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అవినీతి ఎండగడుతాం..
జీవం కోల్పోయిన మూసీకి ప్రాణం పో సే మహాయజ్ఞానికి బీఆర్‌ఎస్ హయాంలోనే అంకురార్పణ చేశామని కేటీఆర్ చెప్పారు. దాదాపు 16 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అంచనాలను లక్షన్నర కోట్లకు పెంచి అతిపెద్ద కుంభకోణానికి తెరతీశారని దుయ్యబట్టారు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెం ట్ కార్పొరేషన్ ఏర్పాటుచేయడంతోపాటు, మూసీలోకి చేరే 2,000 ఎంఎంల్డీ మురుగునీటి శుద్ధి కోసం 36 ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేశామన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీలకు రిబ్బన్లు కట్ చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు. కేవలం 1,100 కోట్లతో కొండ పోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు కాళేశ్వరం నీళ్లను తరలించాలని ప్రణాళికలు రచిస్తే, ఇప్పుడు అంచనాలు అమాంతం పెం చి దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏ కాళేశ్వరం కూలిపోయిందని తప్పు డు కూతలు కూశారో, ఆ కాళేశ్వరమే మూ సీకి ప్రాణం పోసే జీవనాడిగా నిలుస్తోందని తెలిపారు.
నాగోల్-ఉప్పల్ భగాయత్ వద్ద 5 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులను గతంలోనే పూర్తిచేశామని, పేదల ఇళ్లు కూల్చ కుండా పార్కుల నిర్మాణంతో పచ్చదనం పెంచిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేసేలా ఎక్స్‌ప్రెస్ వే ప్రణాళిక కూడా గతంలోనే సిద్ధంచేశామన్నారు.
అభివృద్ధి పేరిట పేదలను నిరాశ్రయులను చేయడం సరైన పద్ధతి కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిచ్చిన సూచన మేరకే ముందుకెళ్లాం తప్ప అక్కడి ప్రజలను రేవం త్ సర్కారులాగా ఇబ్బంది పెట్టలేదని గుర్తుచేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసే కాంగ్రెస్ సర్కారు అవినీతి బాగోతాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎక్కడికక్కడ ఎండగడతామని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఎన్ని లక్షల కోట్ల స్కాం అవుతుందో..
బీఆర్‌ఎస్ హయాంలోనే అతితక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్నిరకాల డిజైన్లు సిద్ధం చేశాయని, వడ్డించిన విస్తరి లాంటి ప్రాజెక్టును పక్కనపెట్టి మళ్లీ కమిషన్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. డిజైన్లు సిద్ధంగా ఉండగా మళ్లీ ఎందుకు మొదటినుంచి ప్రక్రియ చేపడుతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం ప్రణాళికల రూపకల్పన కోసమే రేవంత్ సర్కారు వందల కోట్లు ఖర్చుచేస్తుందంటే, ఇక ఈ స్కామ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఓవైపు అప్పు పుడ్తలేదంటూనే ఏడీబీ బ్యాంకు నుంచి రూ. 4,100 కోట్ల రుణం తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం రేవంత్ రెండునాల్కల విధానానికి నిదర్శనం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఓసారి 50 వేల కోట్లు అని, మరోసారి రూ. 75వేల కోట్లు అని, ఇంకోసారి లక్ష న్నర కోట్లు అని ప్రాజెక్టు చేపట్టకముందే అంచనాలు పెంచుతున్న రేవంత్ సర్కారు, చివరికి ఈ కుంభకోణానికి ఎన్ని లక్షల కోట్లకు తీసుకెళుతుందో లెక్కేలేదని మండిపడ్డారు.
పాపం కాంగ్రెస్, టీడీపీలదే..
అసలు సమైక్యరాష్ట్రంలో మూసీని కలుషితం చేసిందే 60 సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఈ రెండు పార్టీల్లోనే పనిచేసిన చరిత్ర మర్చిపోవడం విడ్డూరంగా ఉందని, గతంలో మీరు చేసిన పాపమే మూసిని మురికి కూపంగా మార్చిందని మండిపడ్డారు. దశాబ్దాలపాటు నల్లగొండ జిల్లా ప్రజలను మూసీ మురికితో ఇబ్బందుల పాలుచేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నల్గొండ గుండెల మీద ఫ్లోరైడ్ బండ పెట్టి లక్షలాది మంది చందమామల్లాంటి పిల్లల జీవితాలను ఛిద్రం చేసిన పాపం కూడా సమైక్య పాలకులదేనని మండిపడ్డారు. గత పాలకులు అని తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న పన్నాగాలను అర్థంచేసుకోలేంత అమాయకులు ఎవరూ లేరని స్పష్టంచేశారు. మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక పథకంతో నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కుండబద్దలు కొట్టారు.
గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ముందుగా అవి కాళేశ్వరం నీళ్లా కాదా చెప్పి ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను బలవంతంగా వెల్లగొట్టి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన భూములను తన అనుయాయులకు, బీనామీలకు కట్టబెట్టే కుట్ర కొనసాగుతోందని కేటీఆర్ స్పష్టంచేశారు.
పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని, రెండేళ్ల నుంచి మూసీ చుట్టుపక్కల ఉన్న భూములను ఎలా కబళించాలని మాత్రమే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో తాము బుల్డోజర్లకు అడ్డంపడి బాధిత ప్రజలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. అయితే మళ్లీ మూసీ ప్రాంత ప్రజలను కాటు వేసేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు.