03-01-2026 12:55:19 AM
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు మొత్తం పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధం కావడానికి ఏడాది సమయం పడుతుందని ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అంచనాలు లేకుండా టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల నుంచి తాము కమీషన్లు కొట్టదలచుకోలేదని వ్యంగ్యంగా అన్నారు. డీపీఆర్ సిద్ధమ య్యాక అసెంబ్లీలోనే ప్రవేశపెట్టి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఇందులో దాపరికమేమీ లేదన్నారు.
మూసీ ప్రాజెక్టు కోసం మెసర్స్ మీన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటె డ్, మెసర్స్ కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ ఆర్‌ఐఓఎస్ డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారని, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారని, అదే తరహాలోనే మూసీని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో గోదావరి జలాలను మూసీకి తరలి స్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
రూ.7 వేల కోట్లతో గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నామని తెలిపారు. 20 టీఎంసీల్లో 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం శుద్ధమైన నీరు పాటించేందుకు ఉపయోగించాలనుకుంటున్నామని వెల్లడించారు. మొదటి దశలో భాగంగా ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలనుకున్నామని తెలిపారు.
రెండు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయబోతున్నామని, మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నామని సీఎం వివరించారు. దీని కోసం ఏడీబీ రూ. 4.1 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని, గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూ ఘాట్ నిర్మించారని, మానవ నాగరికత నదీ పరీవాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందిందన్నారు. కాకతీ యుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించారని, 1908లో నగరాన్ని వరద ముంచెత్తితే, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తు చేశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలిపారు.
అనంతగిరిలో పుట్టిన నీటిలో ఎంతో విలువైన ఔషధ గుణాలున్నయని, ‘వికారాబాద్ కా హవా లాఖో మరిదోంఖో దవా’ నానుడి కూడా ఉందని గుర్తుచేశారు. కానీ ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌస్‌ల డ్రైనేజీని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో కలిపితే ఉక్కుపాదం మోపామని తెలిపారు. ‘జన్వాడలో, మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నోళ్లయితే నాపై దాడి చేశారని, ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాం.
లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలను పర్యటించాం. ప్రపం చస్థాయి నగరాలన్నీ నదీ పరీవాహక ప్రాం తాలను కాపాడుకున్నాయి. గుజరాత్, యూ పీ, ఢిల్లీలో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లను బీజేపీ అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకుంది, మేం వాటిని వ్యతిరేకించలేదు, తప్పుపట్టడం లేదు’ అని సీఎం చెప్పారు.
మతసామరస్యాన్నీ చాటబోతున్నాం..
కొంతమంది తనను రియల్ ఎస్టేట్ బ్రో కర్ అంటున్నారని, రియల్ ఎస్టేట్ కూ డా ఒక ఇండస్ట్రీ అని గమనించాలన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తేనే పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని అన్నారు. రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతుందని, రాబోయే 20 ఏండ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీగా తయారుచేస్తామని, ఆ ప్రాంతంలో నష్టపోయే వారికి బ్రహ్మండంగా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.
నష్టపోయే వారికి మంచి చేస్తామని చెబుతుంటే.. దాని అలానే ఉంచాలని కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు వెళ్లి అక్కడ ఉంటే అక్కడి దుర్భర పరిస్థితులు అర్థమవుతాయని సూచించారు. రూ. 1.5 లక్షల కోట్లతో మూసీ పునరుజ్జీవం చేస్తుంటే, అందులో రేవంత్‌రెడ్డి రూ. 25 వేల కోట్లు తిన్నారని ఆరోపిస్తున్నారని తెలిపారు. వారు కాంట్రాక్టులిచ్చి కమీషన్లు కొట్టినట్టే అనుకుంటు న్నారని విమర్శించారు. నా గురించి మా ట్లాడే అర్హత మీకెక్కడిదని ప్రశ్నించారు. కన్సల్టెంట్ డీటెయిల్స్ ఇచ్చే వరకు అంచనాలు చెప్పలేమని స్పష్టం చేశారు.
మంచిరేవుల దగ్గర ఉన్న పురాతన శివాలయాన్ని అభివృ ద్ధి చేయబోతున్నామని, మూసీ పరివాహకంలో గౌలిగూడ దగ్గర గురుద్వార, మసీదు, ఉప్పల్ దగ్గర మెదక్ చర్చి వంటి చర్చిని నిర్మించి మత సామరస్యాన్ని చాటబోతున్నామని వెల్లడించారు. గాంధీ సరోవర్ నిర్మా ణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. తెలం గాణను అభివృద్ధి చేసేందుకు కేంద్రంతో సయోధ్య పెట్టుకుంటే దానిపై రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రంతో సయోధ్య మీలా కేసుల గురించి కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. గ్రేటర్ హైదరా బాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పా లని సీఎం సూచించారు. పేదలకు మంచి ఇండ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దామని, హైదరాబాద్‌ను ప్రపం చస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే మా సం కల్పమని స్పష్టం చేశారు. మేం మంచి పని చేయాలనుకుంటున్నామని, మీ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. డీపీఆర్ సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ సీఎం ఛాంబ ర్‌లో పవర్ పా యింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సలహాలు తీసుకుంటామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవం ప్రభుత్వ బాధ్యత
మూసీ మురికి శుభ్రం చేసే బాధ్యత ప్ర భుత్వంపై ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు ఎం త కాలం పడుతుందో చెప్పాలని కోరారు. మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... మూసీ పునరుజ్జీవం ప్రజల జీవితాలతో ముడిపడి ఉందని, అందుకే వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంఐఎం సభా పక్ష నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ... మూసీ ప్రాజె క్టును ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగిస్తారని ప్రశ్నించారు.
18 నెలల సమయం పడుతుందంటున్నారని, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకో చెప్పాలన్నారు. గోదావరి నీటిని ఎలా తీసుకొస్తారో వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటి వర కు రెండేళ్లు ఏం చేశారు.. మూడేళ్లు ఏం చేస్తా రో చెప్పాలన్నారు. హైదరాబాద్‌లోని నాలాలు అభివృద్ధి చేయ కుండా మూసీ పునరుద్ధరణ చేసినా ప్రయోజనం ఉండదన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే మా ట్లాడుతూ... మూసీ ప్ర క్షాళన పేరిట మూసీ ప్రాంతమంతా అభివృద్ధి చేస్తారా, కంపెనీలు వ్యాపారం చేసే ప్రాంతం మాత్రమే అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. మూసీపై చర్చ ముగిసిన తర్వాత యూరియాపై చర్చించాలని కేటీఆర్ కోరినా వాయిదా తీర్మా నాన్ని, సోయాబీన్‌పై పాల్వాయి హరీశ్ కోరి నా వాయిదా తీర్మానాన్ని, కూనంనేని సాంబశివరావు ఆర్టీసీపై కోరినా వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
మూసీ కాలుష్యంతో నల్లగొండకు శిక్ష..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ద్వారా వచ్చే మురికి, కలుషితాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయని, మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరీవాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెబుతున్న పరిస్థితి దాపురించిందన్నారు. ప్రపంచ నగరాలు అభివృద్ధి చెందుతున్న విధానాలను చూశాక మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకుని మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు 9 కి.మీ, హిమాయత్‌సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు 11.5 కి.మీ కాగా మొత్తం 21 కి.మీ అవుతుందని, బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ రెండు నదులు కలిసే చోట వీ షేప్‌లో అభివృద్ధి జరుగుతోందన్నారు. గండిపేట పై నుంచి వికారాబాద్ వరకు ఇంకా ప్రణాళికలు సిద్ధం కాలేదన్నారు.
రూ. 7 వేల కోట్లతో గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నామని తెలిపారు. 20 టీఎంసీల్లో 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం శుద్ధమైన నీరు పాటించేందుకు ఉపయోగించాలనుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో గోదావరి జలాలను తరలిస్తామని స్పష్టం చేశారు. రెండు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయబోతున్నామని, మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నామని వివరించారు.
దీని కోసం ఏడీబీ రూ. 4.1 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని, గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందని తెలిపారు. సంక్రాంతి వరకు మొదటి దశ పనులపై స్పష్టత వస్తుందన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. నార్సింగి వద్ద, బాపూఘాట్, ఛార్మినార్, చాదర్‌ఘాట్ దాటిన తర్వాత, నాగోల్ జంక్షన్ల వద్ద ట్రంపెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఓల్డ్ సిటీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ అని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే గౌలిగూడ వద్ద వదిలేసిన మెట్రోను చాంద్రాయణగుట్ట వరకు పొడగిస్తున్నామని తెలిపారు.