27-01-2026 08:40:17 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మేడ్చల్ - జిల్లా, ఉప్పల్ జోన్ పరిధి కాచవానిసింగారంలో హైడ్రా మంగళవారం రోడ్డు ఆక్రమణపై చర్యల చేపట్టింది. మలిపెద్ది హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి 40 ఫీట్ల రహదారిలోకి 13 అడుగుల మేర ఆక్రమించి పక్కనే ఉన్న తన పొలం హద్దులుగా పేర్కొంటూ ఒక కిలోమీటరు మేర ప్రహరీ నిర్మించగా దివ్యానగర్ సింగరేనియన్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నారపల్లి, దివ్యనగర్ కాచవాని సింగారం లను కలుపుతూ సాగే ఈరహదారిని ఆక్రమించారంటూ ఫిర్యాదు చేశారు.
హైడ్రా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించి 13 అడుగుల మేరకు రోడ్డులోకి జరిగి ప్రహరీ నిర్మించారని తేల్చి కూల్చివేశారు. దీంతో రహదారి పూర్తి వెడల్పుతో తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రజా రహదారుల పరిరక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాచివానిసింగారంలో ప్రభుత్వ భూమి 6.12 ఎకరాలను ఆక్రమణదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.