08-09-2025 12:00:00 AM
సూర్యాపేట, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : రాష్ట్ర మంత్రులకు పాలన చేతకాకే పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం దూరజ్ పల్లిలో మాజీ కౌన్సిలర్ బాషా అక్రమ అరెస్టును ఖండిస్తూ విలేకరులతో మాట్లాడారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని తెలిపారు.
యూరియా లైన్ వీడియో తీసి పెట్టినా కేసులు పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. అర్ధం లేని కేసులో అర్ధరాత్రి అరెస్టులు అక్రమమన్నారు. మాజీ కౌన్సిలర్ ను ఓ తాగుబోతు ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుంది అన్నారు.
ప్రజల ఒత్తిడితోనే పోలీసులు తలొగ్గి మాజీ కౌన్సిలర్ ను విడిచి పెట్టారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.