08-09-2025 05:39:13 PM
రేగొండ,(విజయక్రాంతి): వృద్ధురాలి భూమిని కబ్జా చేసి దౌర్జన్యానికి దిగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని బాలయ్య పల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బాలయ్య పల్లి గ్రామానికి చెందిన గుండబోయిన కొమురమ్మ అనే మహిళ కాళ్లు విరగడంతో ఒంటరిగా జీవిస్తుంది. తనకు సర్వే నెంబర్ 199 లో 0-20 గుంటల భూమి ఉంది. దీంతో కొమరమ్మకు ఆరుగురు సోదరులు కాగా వారే ఆ భూమిని వంతుల వారిగా సాగు చేస్తూ కొమురమ్మ ఆలనా పాలన చూసుకుంటూ ఆమెకు తిండి పెట్టేవారు.ఈ క్రమంలోనే కొమరమ్మ సోదరుడు రాజయ్య కుమారుడు వరుసకు మేనల్లుడు అయిన బిక్షపతి కాస్తు చేస్తున్న సమయంలో వృద్ధురాలిని నమ్మించి 20 గుంటల భూమిని తనపై పట్టా చేయించుకోవడంతో వృద్ధురాలి మిగతా అన్నదమ్ములు ఆమెను పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అక్రమంగా భూమి ఎక్కించుకున్న బిక్షపతి కూడా తన బాగోగులు చూసుకోక పోవడంతో చిన్న పూరి గుడిసెలో ఒంటరిగా జీవిస్తున్న బాధిత కొమరమ్మ 10 రోజుల క్రితం కాలు జారి పడడంతో రెండు కాళ్లు విరిగి మంచానికి పరిమితమైందని గ్రామస్తులు తెలిపారు.బాధితురాలి భూమిని అమ్మి తనకు వైద్యం చేసి వృద్ధాశ్రమానికి తరలించాలని గ్రామస్తులు బిక్షపతి ని కోరగా మీరేం చేసుకుంటారో చేసుకోమని నేను భూమిని ఇచ్చేది లేదని బహిర్గతంగానే చెప్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. వృద్ధురాలు కొమరమ్మకు న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులు స్పందించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని బాలయ్య పల్లె గ్రామస్తులు సోమవారం మీడియా ముఖంగా తెలియజేశారు.