08-09-2025 05:36:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య శాంతియుతంగా ముగిశాయి. నిన్న రాత్రి వరకు సాగిన వినాయక నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిమజ్జనం ఉత్సవాల ముగిసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తుగా తీసుకున్న చర్యల వలన ఎక్కడా లోటుపాట్లు లేకుండా కార్యక్రమం పూర్తయింది తెలిపారు.
నిమజ్జన ఘాట్ల వద్ద భద్రతా చర్యలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అగ్నిమాపక, ఆరోగ్య, ట్రాన్స్‌పోర్ట్ వంటి విభాగాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, గణేష్ ఉత్సవ కమిటీలు సమిష్టిగా పనిచేయడం వల్లే ఈ సాంప్రదాయ కార్యక్రమం విజయవంతమైందని కలెక్టర్ అభినందించారు. వినాయక సాగర్‌లో నిమజ్జనానంతరం పారిశుద్ధ్య చర్యలను వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసు సిబ్బంది, గణేష్ కమిటీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.