08-09-2025 06:29:21 PM
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్08(వికాయక్రాంతి): సమగ్ర కేంద్ర వ్యవసాయ కార్మిక చట్టాన్ని అమలు చేయాలని బి కె యం యు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ బి కె యం యు రాష్ట్ర సమితి పిలుపుమేరకు కలెక్టర్ ముందు నిరసన ధర్నా చేసి అదనపు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. సందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని, బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, ఉపాధి హామీ కూలీలకు 700 రూపాయలు వేతనం ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని, కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కూలీలకు 5 వేల పెన్షన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకం కింద 12 వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదని, సామజిక పెన్షన్ 4వేలు వికలాంగుల పెన్షన్ 6 వేలు ఇస్తానని చెప్పిన ఇంత వరకు అమలు కావడం లేదని, ఇందిరమ్మ ఇండ్లలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలందరికి ఇవ్వాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.