04-11-2025 08:13:15 PM
టౌన్ ప్లానింగ్‌లో ‘బయటి’ చక్రం!
మణికొండ (విజయక్రాంతి): స్థానిక మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పుడు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్యాలయంతో ఎలాంటి అధికారిక సంబంధం లేని ఓ బయటి వ్యక్తి, ఏకంగా విభాగాన్నే తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొద్దికాలం క్రితం బాధ్యతలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సదరు వ్యక్తి పూర్తిగా బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది.
తనకు గతంలో ఉన్న కొందరు బిల్డర్లతో పరిచయాలను ఆసరాగా చేసుకుని, కొత్త అధికారికి స్థానిక అంశాలపై అవగాహన లేకపోవడాన్ని అదనుగా తీసుకుని తప్పుదోవ పట్టిస్తున్నట్లు సమాచారం. "అంతా నేను చూసుకుంటా," "ఏ ఫైల్ అయినా నేనే నడిపిస్తా" అంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌కు మాయమాటలు చెబుతూ, తెరవెనుక తనే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఏకంగా మున్సిపల్ కమిషనర్ పేరును వాడుతూ, కొందరు బిల్డర్లతో అనాధికారికంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.