04-11-2025 10:07:37 PM
* కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీతో గర్భిణులు, చిన్నారుల హెల్త్ పై ప్రభావం
* నాసిరకం ఆహారంతో ప్రాణాలకే ప్రమాదమని విపక్షాల ఆగ్రహం
* కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని సీడీపీవోకు వినతి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంగన్‌వాడీ కేంద్రాలలో నాణ్యతలేని, కుళ్లిపోయిన కోడిగుడ్లను పంపిణీ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. అత్యంత కీలకమైన పౌష్టికాహారాన్ని అందించాల్సిన పథకంలో ఈ విధంగా కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంపై చిన్నారులు, బాలింతలు, గర్భిణుల కుటుంబాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంగన్‌వాడీ కోడిగుడ్ల కాంట్రాక్టర్ సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయి, తినడానికి పనికిరాకుండా ఉన్నాయని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పౌష్టిక ఆహారం అందక తాము ఇబ్బందులు పడుతున్నట్టు బాధితులు తెలిపారు. దీనిపై బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు స్పందించారు. కుళ్లిపోయిన కోడిగుడ్ల వ్యవహారంపై సీడీపీవో జయప్రదకు ఫిర్యాదు చేశారు." నాసిరకం ఆహారంతో చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యులు?" అని ఆమెను నిలదీశారు.
నాణ్యత లేని ఆహారం పంపిణీ చేసి, అమాయక లబ్ధిదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న జిల్లా కాంట్రాక్టర్, ఇక్కడ పనిచేస్తున్న సబ్ కాంట్రాక్టర్‌పై చట్టపరంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. నాసిరకం కోడిగుడ్లను పంపిణీ చేసిన సదరు కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పౌష్టికాహారం పంపిణీలో జరిగిన ఈ నిర్లక్ష్యంపై అధికారులు కండ్లు మూసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఆందోళనలో బీజేపీ, బీఎస్పీ నాయకులు అనంతస్వామి, ఎలగందుల శంకర్, పోలోజు రాజేందర్, బాధితులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహార నాణ్యతపై తక్షణమే పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపిస్తుంది. అధికారులు కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.