calender_icon.png 19 September, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల జోక్యంతోనే అక్రమ ఇసుక రవాణా

19-09-2025 07:35:35 PM

-అరికట్టాలంటూ రోడ్డుపై కాంగ్రెస్ ధర్నా, వినతి పత్రం అందజేత

-టేకుమట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్

చిట్యాల,(విజయక్రాంతి): దళారుల జోక్యంతో అనుమతులకు మించి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని టేకుమట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పేరిట రెవెన్యూ అధికారులు, మధ్య దళారులు కుమ్మక్కై అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్నారు. 

స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ఆదేశించినా  అనుమతులకు మించి ఇసుక రవాణా జరుగుతుందని మండిపడ్డారు. కేవలం టేకుమట్ల మండలంలోని కాకుండా రేగొండ,శాయంపేట,మొగుళ్ళపల్లి, చిట్యాల మండలంలో క్వారీలను ఓపెన్ చేసి ఇసుకను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకు ఒక్కో ట్రాక్టర్ కు 25 ట్రాక్టర్ల‌ ఇసుకకు అనుమతి ఉంటే రోజుకు 200 నుండి 250 ఇసుక ట్రిప్పులు తరలుతున్నాయని,దీనివల్ల ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు .ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్న అక్రమార్కుల పైన కేసులు నమోదు చేయట్లేదని,మామూలుగా ట్రాక్టర్‌లతో ఇసుకను తరలిస్తున్న వారి పైన కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనుమతులకు మించి ఇసుక తరలిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.