calender_icon.png 19 September, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

19-09-2025 08:57:57 PM

మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు  ఉద్యోగులు బాధ్యతాయు తంగా విధులు నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన మండల తహశీల్దార్ కార్యాలయాన్ని తహశీల్దార్ పి సతీష్ కుమార్ తో కలిసి సందర్శించి, రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ సేవల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించా లని, విధులు బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియలో భాగంగా పనులను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.

వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, వంటశాల, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ, అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విధులలో సమయపాలన పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. ఆనంతరం మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్ గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేశారు. వెంకటాపూర్ గ్రామంలో నర్సరీని సందర్శించి, మొక్కల సంరక్షణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.