19-09-2025 07:42:27 PM
మునుగోడు,(విజయక్రాంతి): మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి మూలాధారమనే నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్ధ నారీ- సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య అధికారి పుట్టల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన స్వస్థ నారీ-సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడం, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించడం.
రక్తహీనత నివారణ, తల్లి శిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించడం తదితరాలు చేపడతారన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యం పై కేంద్ర రాష్ట్ర అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.