స్వరం మారుతోంది
లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటికీ, ఇప్పటికీ ప్రధాని మోడీ ప్రసంగాల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 400కు పైగా స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యమని మొదట్లో ప్రకటించిన ఆయన ఆ తర్వాత లక్ష్యాన్ని చేరుకోవడానికి హిందూ సమాజాన్ని ఏకం చేసే దిశగా ఉధృతస్థాయిలో ప్రచారం కొనసాగించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన సంపద పంపిణీ అంశం లక్ష్యంగా మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులనే కాకుండా మహిళల మెడలోని తాళిబొట్లనూ లాగేసుకుని వలస వచ్చినవారికి, అధిక సంతానం ఉన్నవారికి పంచి పెట్టేస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారాయి. ముస్లిం మైనారిటీల గురించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తారని, ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆ పార్టీలన్నీ ముక్తకంఠంతో ప్రధానిపై ఎదురు దాడి చేశాయి. ప్రధాని నేరుగా ముస్లింల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఆయన వ్యాఖ్యలు తమ గురించేనన్న భావన ముస్లింలలో కలగడానికి అవి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జరిగిన రెండు దశల పోలింగ్ వరకు బీజేపీ పరిస్థితి సజావుగానే సాగినా మూడు, నాలుగో దశల పోలింగ్‌లో యూపీ, బీహార్‌లో ఓటింగ్ తగ్గడంతోపాటు బీజేపీ అనుకూల ఓటు శాతం తగ్గుముఖం పట్టినట్లు వార్తలు రావడం ఆ పార్టీని, ముఖ్యంగా పార్టీ ప్రధాన వ్యూహకర్త ప్రధానిని కాస్త కలవరపెట్టినట్లు కనిపిస్తోంది.
400 స్థానాల మాట అటుంచి కనీస మెజారిటీ కూడా రాదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా ఆ పార్టీపై పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, గత కొద్ది రోజులుగా ప్రధాని ప్రచార సభల్లో ఎక్కడా 400 సీట్ల అంశాన్ని, అయోధ్య రామమందిరం వంటి హిందువుల అంశాల ప్రస్తావనను తగ్గించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.వారణాసిలో నామినేషన్ వేసిన సమయంలో అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నా, కాలభైరవ మందిరంలో పూజలు జరిపినా హిందుత్వకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదే సందర్భంలో ఓ జాతీయ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని తాను చేసినట్లుగా చెప్తున్న వ్యాఖ్యలపై తొలిసారి వివరణ ఇచ్చారు. తాను హిందూ, ముస్లింలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అధిక సంతానం కలిగిన వారన్న మాటలను వక్రీకరించి ముస్లింల గురించే తాను మాట్లాడినట్లు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల ఘటననూ మోడీ ప్రస్తావిస్తూ, తనను అప్రతిష్ఠ పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అలా మాట్లాడితే ప్రజాజీవితంలో ఉండడానికే తగనని కూడా వ్యాఖ్యానించారు.
అయితే, ఇన్ని రోజుల తర్వాత ప్రధాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం వెనుక కారణాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడు, నాలుగు దశల పోలింగ్‌లో బీజేపీకి ఎదురుగాలి స్పష్టంగా కనిపించడమే ప్రధాని ఆత్మరక్షణలో పడడానికి ప్రధాన కారణమై ఉంటుందనేది వారి అభిప్రాయం. ఇంతకు ముందున్న దూకుడుకు బదులు బుజ్జగింపు ధోరణిలో మాట్లాడడానికి అదే కారణం కావచ్చనేదీ వారి భావన. దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో పోలింగ్ ముగియడం, ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఆశించినట్లుగా పెద్దగా కలిసివచ్చే వాతావరణం లేకపోవడం కూడా కమలనాథులను కలవరపెడుతోందని వారంటున్నారు. మిగిలిన మూడు దశల పోలింగ్ అంతాకూడా ఉత్తరాది రాష్ట్రాల్లోనే జరగనుండడం, అక్కడి పలు చోట్లు ముస్లిం ఓటర్లు గెలుపోటములను నిర్ణ్ణయించే స్థితిలో ఉండడంతో ప్రధాని స్వరంలో మార్పు వచ్చి ఉంటుందని వారంటున్నారు. ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా కూటమి బలం ఇప్పుడు పెరిగిందా? బీజేపీకి కనీస మెజారిటీ రావడం కూడా కష్టమేనా? అన్న ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం లభించడం కష్టం. కానీ, కమలనాథుల దూకుడు స్వరంలో మార్పు మాత్రం నిజం.






