2 July, 2026 | 2:28 AM

హామీల అమలు ఎప్పుడో!

12-06-2024 02:14 AM

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కోడ్ అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారని, ఇప్పుడు కోడ్ ముగిసిన నేపథ్యంలో వాటిని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆర్నెల్లు అయినా కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప నెరవేర్చిందేమీ లేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న ఏకకాలంలో మాఫీ చేస్తామని ప్రకటించి మాట తప్పిన సీఎం..

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఆగస్టు 15 వరకు అమలు చేస్తామని రైతుల నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. అధికారంలో ఉండి 63 ఎమ్మెల్యే సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు వస్తే కేవలం 8 సీట్లున్న తాము అంతే సంఖ్యలో సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటామని వెల్లడించారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి హంగామా చేసి దాన్ని మూణ్నాళ్ల ముచ్చటగా మార్చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం న్యాయ విచారణ పేరిట జరుగుతున్నది కంటితుడుపు చర్య మాత్రమేనని, సీబీఐకి కేసును అప్పగిస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని తెలిపారు.