31-12-2025 01:45:30 AM
విద్యార్థి కేశవర్ధన్కు విద్యాశాఖాధికారి అభినందనలు
నూతనకల్, డిసెంబర్ 30: మేళ్లచెరువులో జరిగిన సైన్స్ ఫెయిర్లో నూతనకల్ మండల పరిధిలోని పెదనేమిలా గ్రామానికి చెందిన విద్యార్థి జి. కేశవర్ధన్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గైడ్ టీచర్ కె. హరి కృష్ణ పర్యవేక్షణలో కేశవర్ధన్ ప్రదర్శించిన ‘ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ మ్యాన్హోల్స్‘ నమూనాను అధికారులు మరియు సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.వర్షాకాలంలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో డ్రైనేజీ కాలువలలో నీటి ప్రవాహం ఉధృతమై పీడనం పెరుగుతుంది. దీనివల్ల మ్యాన్హోల్ మూతలు ఒక్కసారిగా ఎగిరి పక్కకు పడిపోతున్నాయి.
రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో ఆ గుంతలు కనపడక దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సైకిళ్లు, బైక్ లు మ్యాన్హోల్స్లో పడి తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ముప్పును ముందే పసిగట్టి, అదుపు చేసే విధంగా కేశవర్ధన్ ఈ ప్రాజెక్టును రూపొందించారు.సైన్స్ ఫెయిర్లో ఈ ప్రదర్శనను సందర్శించిన విద్యాశాఖాధికారి అశోక్ ప్రాజెక్ట్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.సామాజిక సమస్యకు సాంకేతిక పరిష్కారం చూపిన విద్యార్థి కేశవర్ధన్ను, అతనికి అండగా నిలిచిన గైడ్ టీచర్ హరి కృష్ణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు రావడం గర్వకారణమని ఆయన కొనియాడారు.