21-10-2025 07:16:35 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
మానకొండూర్ (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం మానకొండూరు మండలంలోని వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్, మెడిసిన్ స్టోర్స్, వ్యాక్సిన్లు నిల్వ చేసే గది, లేబర్ రూమ్, వార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలోని పలు రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భిణీలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రతినెలా ఉచిత మందులు అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు ఉంటాయని విషయాన్ని వారికి తెలియజేయాలని అన్నారు. ఆవరణలో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు లేకుండా ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, వైద్యులు సాయి ప్రసాద్, వెంకటేష్, తహసీల్దార్ విజయ్, తదితరులు ఉన్నారు.