calender_icon.png 26 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాధాన్యమున్న పాత్రల్లోనే..

26-10-2025 01:06:36 AM

‘కేజీఎఫ్’తో పాన్‌ఇండియా సక్సెస్ అందుకున్న కన్నడ కస్తూరి శ్రీనిధిశెట్టి. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ విడుదలైన తర్వాత ఏకంగా నాలుగేళ్లు విరామం తీసుకున్న ఈ అమ్మడు మళ్లీ ‘కేజీఎఫ్2’, ‘కోబ్రా’లో నటించింది. ఆ తర్వాత మరో ఛాన్స్ ‘హిట్3’లో పొందడానికి మూడేళ్ల సమయం పట్టింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచ యమైన శ్రీనిధిశెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇందులో గ్లామర్‌కు తావు లేకుండా డీసెంట్ రోల్ పోషించి, విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇటీవల విడుదలైన ‘తెలుసు కదా’లో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ప్రేక్షకులను పలుకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే వెంకటేశ్ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ ఇటీవల శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రబృందం ఆమె తమ సినిమాలో భాగమైనట్టు ప్రకటించింది.

మొత్తానికి వెంకీ మామకు జోడీగా శ్రీనిధి ఫైనల్ అయింది. ఇప్పటిదాకా శ్రీనిధిశెట్టి జర్నీని చూస్తూ వస్తున్న విశ్లేషకులు ఈ అమ్మడికి మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. శ్రీనిధి నటనకు ఆస్కారం ఉన్న, తనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుండటమే ఇందుకు కారణం.

నటనలో తనదైన ప్రతిభ కనబరుస్తుండటం, గ్లామర్ పాత్రలకు, డిజైనర్ దుస్తులకు దూరంగా ఉండటం, అందాల ఆరబోతకు నో చెప్పటం, మూవీ ప్రమోషన్స్‌లో పద్ధతైన దుస్తులు ధరించి కనిపిస్తుండటం.. ఇవన్నీ శ్రీనిధిని మిగతా హీరోయిన్ల నుంచి వేరు చేస్తున్నాయి. అయితే, శ్రీనిధి అనుసరిస్తున్న ఈ విధానం కారణంగా మరెన్నో అవకాశాలు కోల్పోయే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కెరీర్ మొత్తం కొనసాగిస్తుందా? చూడాలి.